Kanti velugu second phase: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం నేడు ప్రారంభంకానుంది. ఖమ్మంలో సీఎం కేసీఆర్ సహా... కేరళ, పంజాబ్, దిల్లీ ముఖ్యమంత్రుల చేతుల మీదుగా కంటి వెలుగును ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం సుమారు ఒంటి గంటకు ఖమ్మంలో కంటివెలుగు లాంఛనంగా ప్రారంభం కానుండగా... రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి గ్రామ, మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులను సర్కారు ఏర్పాటు చేయనుంది.
Kanti velugu scheme : ఇందుకోసం 1500 వైద్య బృందాలను సిద్ధం చేసింది. వీటికి తోడు మరో 5 శాతం అదనంగా కంటి వెలుగు బృందాలు నిత్యం అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి బృందంలో ఒక వైద్య అధికారి, 8 మంది సిబ్బంది ఉంటడనున్నారు. వారిలో ఒక అప్తోమెట్రిస్ట్, సూపర్‌వైజర్, ఇద్దరు ఎఎన్ఎమ్లు, ముగ్గురు ఆశా వర్కర్లు, ఒక కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. నేటి నుంచి జూన్ 15 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో 16,556 ప్రదేశాలలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో శిబిరాలను నిర్వహించనున్నారు.
Kanti velugu scheme in telangana : ఇందులో గ్రామీణ ప్రాంతాలలో 12,768 వైద్య శిబిరాలు, పట్టణ ప్రాంతాలలో వైద్య 3,788 శిబిరాలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వంద రోజుల్లో కంటి పరీక్షలు పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగనున్న సర్కారు... సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపులను నిర్వహించనుంది. సెలవు దినాల్లో క్యాంపులు నిర్వహించబోమని తెలిపింది.
కంటి వెలుగు నిర్వహణలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించనున్నారు. కంటి వెలుగు కరపత్రాలతో ఇంటింటికి వెళ్లి వారి పేర్లు, ఏ సమయానికి సెంటర్‌కు వచ్చి టెస్టులు చేయించుకోవాలన్న వివరాలను అందజేయనున్నారు. ఫలితంగా ప్రజలకు గంటలతరబడి కేంద్రాల వద్ద ఎదురు చూడాల్సిన అవసరం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 200 కోట్లతో చేపట్టిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా ప్రతి కేంద్రంలో ఐదంచెల విధానాన్ని అమలు చేస్తున్నారు.
ప్రజలు కేంద్రానికి వచ్చినప్పుడు ముందుగా వెయిటింగ్ రూమ్, తర్వాత రిజిస్ట్రేషన్, కంటి పరీక్షలు, కంప్యూటర్ ద్వారా అద్దాల నిర్ధారణ, మందుల పంపిణీ, కళ్లజోళ్లు అందించడం వంటి అన్నింటిని ఒకే సారి పూర్తి చేయనున్నారు. ప్రతి ఒక్కరికి కంప్యూటరైజ్డ్ పరీక్షలు చేసి వారి దృష్టిలోపాలను గుర్తించటంతోపాటు.. అవసరమైన వారికి రీడింగ్, ప్రిస్క్రైబ్డ్ కళ్లద్దాలను అందించనున్నారు.
ఇందుకోసం సర్కారు ఇప్పటికే 50 లక్షల కళ్లద్దాలను జిల్లాలకు పంపిణీ చేయడం విశేషం. అందులో 30 లక్షల వరకు రీడింగ్ గ్లాసులు కాగా... మరో 20 లక్షల వరకు ప్రిస్క్రైబ్డ్ కళ్లద్దాలే. ఇక ఎవరికైనా ప్రత్యేకంగా అద్దాలు అవసరమైతే ఆయా కేంద్రాల్లో అప్పటికప్పుడే అద్దాల కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ద్వారా కళ్లద్దాలు తయారుచేసే సంస్థలకు ఆర్డర్ పంపనున్నారు. ఫలితంగా బార్ కోడ్‌తో కూడిన బాక్సుల్లో 15 రోజుల్లోనే కళ్లద్దాలు ఎఎన్‌ఎమ్‌లకు... అక్కడి నుంచి ప్రజలకు అందించనున్నారు.
అర్హులైన వారందరికీ ఉచితంగా కళ్లజొళ్లు అందించటంతోపాటు.. ఇతరత్రా కంటి సమస్యను గుర్తించి.. తగిన మందులు అందజేసి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలకు పంపనున్నారు. ఫలితంగా నిర్మూలించదగిన అంధత్వ సమస్యలను ముందుగా గుర్తించి... కంటిచూపును కాపాడుకోవచ్చని సర్కారు భావిస్తోంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ తరహా కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.
ఇవీ చదవండి: