ప్రాజెక్టులకు తొలగిన అడ్డంకి సీతారామ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారిన అటవీ భూముల సేకరణ కొలిక్కివచ్చింది. భూముల బదలాయింపునకు కేంద్రం పచ్చజెండా ఊపింది. పర్యావరణ శాఖ అనుమతితో.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1531 హెకార్ల అటవీ భూమిని బదిలీ చేయనున్నారు. మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, ఖమ్మం అటవీ డివిజన్లకు చెందిన భూమిని కాల్వలు, సొరంగాల తవ్వకం, విద్యుత్ లైన్ల కోసం వినియోగిస్తారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి..!
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 204 హెక్టార్ల అటవీ భూమిని బదిలీ చేస్తూ కూడా జీవో జారీ అయింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అటవీ డివిజన్ పరిధిలో మొదటి ఎత్తిపోతల పంప్ హౌజ్, నార్లాపూర్ జలాశయం, నార్లాపూర్ - ఏదుల జలాశయాల మధ్య సొరంగం పనులు చేపడతారు. ఈ మేరకు ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.