Floods Treat to Inland Areas in Khammam : ఖమ్మం నగరపాలికతో పాటు ఉభయ జిల్లాల్లోని అన్ని పురపాలికల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు.. ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నపాటి వర్షాలకే పట్టణాల్లోని పలు ప్రాంతాలను.. రోజుల తరబడి వరదలు ముంచెత్తుతున్నాయి. ఖమ్మంలోని దానవాయిగూడెం, టీఎన్జీవో కాలనీ, ప్రకాశ్ నగర్, మోతీనగర్, వెంకటేశ్వరకాలనీ, బొక్కలగడ్డ, సారథినగర్, పాండురంగాపురం, శ్రీరాంనగర్, జయనగర్, ప్రశాంతినగర్ కాలనీల్లో.. వర్షం వచ్చినప్పుడల్లా వరద నీరు చేరి స్థానికులు అవస్థలు పడుతున్నారు.
ఫలితంగా ఇక్కడ ఏటా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. వైరాలోని ఇందిరమ్మ కాలనీ ప్రతిసారీ వానాకాలంలో ముంపునకు గురవుతుంది. నల్లచెరువు వాగుకు ఆనుకొని ఉన్న కాలనీలోని ఇళ్లల్లోకి నీరు పూర్తిగా చేరుతుంది. ఇక్కడ కరకట్ట కట్టాలని ప్రతిపాదన ఉన్నా అమలుకు నోచుకోలేదు. మధిర పురపాలిక పరిధిలోని ఎంప్లాయిస్ కాలనీ, ముస్లిం కాలనీ, హనుమాన్, వరద రాఘవాపురం కాలనీలు ప్రతి ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి.
సమస్యల పరిష్కారానికి కనిపించని బల్దియాల చొరవ : ఈ నాలుగు కాలనీల్లో దాదాపు 3 వేల మందికిపైగా జనాభాకు కష్టాలు తప్పట్లేదు. రెండు దశాబ్దాల క్రితం ముంపును అరికట్టేందుకు మట్టి కరకట్టను నిర్మించారు. అది కాలక్రమేణా వరదకు కుంగిపోయింది. ప్రస్తుతం చిన్నపాటి వర్షానికే కాలనీలన్ని వరద గుప్పిట్లో చిక్కుకుంటున్నాయి. సత్తుపల్లి పురపాలిక పరిధిలో ప్రధానంగా నీలాద్రి అర్బన్ పార్క్ ఎదురుగా పాత గౌతమ్ స్కూల్ ప్రాంతం, జవహర్ నగర్, జంగాల కాలనీ, కొమ్మేపల్లి, యానాదులు రోడ్డు వంటి ప్రాంతాలు ఏటా ముంపునకు గురవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం తీవ్ర ఇబ్బందిగా మారింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. పాల్వంచ పరిధిలోని శ్రీనివాస కాలనీ, ఇందిరానగర్ , వెంగళరావు నగర్, జయమ్మ కాలనీ, ప్రశాంతి నగర్, మంచికంటి నగర్ ముంపు ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్మాణం లేకపోవడం వల్ల మురుగు ప్రవాహం అంతా కాలనీల్లోకి ప్రవహించి ముంపునకు గురవుతున్నాయి. కొత్తగూడెం పురపాలక పరిధిలో రామవరం, సుభాష్ నగర్, చంద్రబోస్ నగర్, ప్రగతి నగర్, రైల్వే అండర్ బ్రిడ్జి ఏరియాలో వరద నీరు నిలిచి స్థానికులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. ఇల్లందు పట్టణంలో సత్యనారాయణపురం, నంబర్ టు బస్తి, కళాసిబస్తీ, ఎల్‌బీఎస్‌నగర్, స్టేషన్ బస్తీ కాలనీలు ముంపునకు గురవుతాయి. వర్షాకాలంలో ఇల్లందులపాడు చెరువు నుంచి వరద నీరు బుగ్గ వాగులోకి ప్రవహిస్తుంది.
పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు.. బుగ్గ వాగులో కలుస్తుంది. దాంతో వాగు నిండిపోయి పరిసర ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరుతుంది. వాగు నుంచి వరద నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాల్సి ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మణుగూరు పట్టణమైతే గత 30 ఏళ్లుగా వరద సమస్యతో అతలాకుతలం అవుతూనే ఉంది.
వర్షాకాలం నేపథ్యంలో పురపాలికల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరకుండా ఈ సారైనా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు చెబుతున్నారు. కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి వ్యర్థాలను పూర్తిగా తొలగించాలంటున్నారు. డ్రైనేజీ, మ్యాన్ హోళ్లు, శుభ్రం చేయడంతో పాటు కాలువలను విస్తరించాలని కోరుతున్నారు. ఏవైనా ఆక్రమణలు ఉంటే తొలగించి వరద నీరు సాఫీగా వెళ్లడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు పురపాలికల్లో ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో... మళ్లీ సమస్యలు తప్పేలా లేవని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: