కన్నబిడ్డను వేరే వ్యక్తికి అమ్మేందుకు ఓ తండ్రి ప్రయత్నించిన ఘటన... ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీసరాజుపల్లి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన మాలోతు రమేష్-అనూషకు ఒక నాలుగేళ్ల బాబు, రెండేళ్ల పాప ఉండగా... అనూష మూడు నెలల క్రితం మరో పాపకు జన్మనిచ్చింది.
అనూష గర్భిణీగా ఉన్నప్పుడే... అబార్షన్ చేయించుకోవాలని రమేష్ ఒత్తిడి తెచ్చాడు. కానీ అనూష ఒప్పుకోలేదు. ఇంతలో ఆడపిల్లకు జన్మనివ్వడం, దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల... కూతురిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. తండాకు చెందిన ఓ దళారితో కలిసి విజయవాడకు చెందిన వ్యక్తికి 50 వేలకు పాపను అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నాడు.
తన భర్త చేస్తున్న కుట్రను కనిపెట్టిన అనూష... కుటుంబసభ్యులకు సమాచారమిచ్చింది. ఈ విషయం పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు చేరింది. వెంటనే తండాకు వచ్చి అనూషను విచారించారు. ఆ సమయంలో రమేష్ అక్కడ లేనందున... బిడ్డను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కుటుంబసభ్యులను హెచ్చరించారు.
ఇదీ చూడండి: కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: లక్ష్మణ్