coconut board in Telangana : రాష్ట్రంలో వాణిజ్య, ఉద్యానపంటల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ, ఉద్యానశాఖలు కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వం లక్ష్యం బాగున్నప్పటికీ.. సరికొత్త పంటల సాగువైపు మళ్లిన రైతులకు ప్రభుత్వం సరైన దశ-దిశ చూపడం లేదన్న అపవాదు మూటగట్టుకుంటోంది. ఇందుకు రాష్ట్రంలో కొబ్బరి సాగుదారుల సమస్యలే తార్కాణంగా నిలుస్తున్నాయి. ఒక్కసారి సాగు చేస్తే సుమారు 70 ఏళ్ల వరకు ఆదాయం ఇచ్చే పంటకు శ్రీకారం చుట్టిన సాగుదారులకు ఎదురవుతున్న సమస్యలు ఏటికేడు పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం.
Farmers demands coconut board in Telangana : రాష్ట్రంలోనే అత్యధికంగా కొబ్బరి సాగుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6000 ఎకరాల్లో సాగవుతోంది. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే సుమారు 4500 ఎకరాల్లో కొబ్బరిని రైతులు సాగు చేస్తున్నారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూులు జిల్లాల్లోనూ తోటలు ఉన్నాయి. అశ్వారావుపేటలో 50 ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భద్రాద్రి జిల్లాలోనే అత్యధికంగా కొబ్బరి సాగవుతుండటం వల్ల ఇక్కడే బోర్డు కొలువుదీరాలని రైతులు ఆశిస్తున్నారు.
ప్రధానంగా మార్కెటింగ్ సమస్య.. రైతులకు పెను సవాలుగా మారుతోంది. మార్కెటింగ్ అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడి రైతులు.. ఏపీ లేదా హైదరాబాద్ తీసుకెళ్లాల్సి వస్తుంది. కొబ్బరి అనుబంధ పరిశ్రమలు ఏర్పాట్ల కోసం ప్రభత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రభుత్వ రాయితీలు అందడం లేదు. తోటలు వేసుకున్నప్పుడు మొక్కకు 40 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. కానీ..పైసా కూడా అందడం లేదు. రైతులు దరఖాస్తులు చేసుకున్నా రాయితీలు అందని పరిస్థితి ఉంది.
దేశవ్యాప్తంగా కొబ్బరి బోర్డు రైతుల అవసరార్థం కొబ్బరిబోర్డు పనిచేస్తుంది. కొబ్బరి అభివృద్ధి, పథకాల అమలు లక్ష్యంగా 1981 జనవరి 12న కొబ్బరి అభివృద్ధి మండలి ఏర్పాటు చేశారు. భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పని చేస్తుంది. కేరళలోని కొచ్చిలో సీడీబీ ప్రధాన కార్యాలయం ఉండగా బెంగళూరు, చెన్నై, గౌహతి, పాట్నాలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా విజయవాడ, థానే, పిట్టపల్లి, పోర్ట్ బ్లెయిర్, కోల్ కత్తా నగరాల్లో బోర్డు శాఖలు ఉన్నాయి.
ఇన్ని విధాలుగా కొబ్బరిబోర్డు సమగ్ర అభివృద్ధికి పలు పథకాలు అమలు చేస్తోంది. కొబ్బరిబోర్డు ఉంటే మార్కెటింగ్, పరిశ్రమల ఏర్పాటు సులభమవుతుంది. పాత తోటల తొలగింపు, కొత్తగా తోటల పునరుద్ధరణ, సాంకేతిక సంస్థ, బీమా పథకాల అమలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందజేసేందుకు బోర్డు సహకరిస్తోంది. ఇన్ని విధాలుగా సేవలు అందించే కొబ్బరిబోర్డు శాఖను.. రాష్ట్రం లో ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
సుమారు 15 ఏళ్లుగా భద్రాద్రి జిల్లాలో కొబ్బరిబోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ ముందడుగు మాత్రం కనిపించడం లేదు. భద్రాద్రి జిల్లా కొబ్బరి బోర్డు ఏర్పాటుకు అనువైన జిల్లాగా ఉంటుందని జిల్లా అధికారులు... రాష్ట్ర ఉద్యానశాఖకు లేఖ రాశారు. త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి:
'ఎన్నితీర్లు నష్టపోతిరా.. ఆదుకునే దిక్కులేదురా'.. గుండెల్ని మెలిపెడుతున్న రైతు పాట
మామిడి నేలరాలింది.. వరిపంట నీటిపాలైంది.. వడగండ్ల వాన కడగండ్లు మిగిల్చింది