ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు యోధుడు టీవీ చౌదరి కన్నుమూశారు. అటవీ భూముల పరిరక్షణ, రైతుల సమస్యలపై ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించిన టీవీ చౌదరి.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. మంగళవారం రాత్రి అస్తమించారు.
తీరని లోటు..
కమ్యూనిస్టు యోధుడి మృతి పట్ల.. రాజకీయ పక్షాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన టీవీ చౌదరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటని పలువురు తెలిపారు. అనంతరం కమ్యూనిస్టు శ్రేణులు, అభిమానుల అశ్రునయనాల మధ్య చౌదరి అంత్యక్రియలు నిర్వహించారు.
మంగళవారం రాత్రి తుదిశ్వాస..
సీపీఐ సంస్థాగత నిర్మాణంతో పార్టీ బలోపేతం కోసం దశాబ్దాల పాటు చౌదరి కృషి చేశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సీపీఐ నాయకులు, పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉదయమే టీవీ చౌదరి భౌతికకాయానికి మంత్రి పువ్వాడ అజయ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.
జిల్లా కార్యాలయానికి పార్దీవ దేహం..
బుధవారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని సీపీఐ జిల్లా కార్యాలయానికి తరలించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు తుదివీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చారు. పార్టీ కార్యాలయంలో ఉంచిన టీవీ చౌదరి పార్థీవదేహంపై సీనియర్ నేతలు పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు...ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. కమ్యూనిస్టు యోధుడి మృతిపట్ల సీపీఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి సంతాపం ప్రకటించారు.
అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా..
చౌదరి విద్యార్థి, యువజన నాయకుడిగా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. సీపీఐలో క్రియాశీలకంగా వ్యవహరించారు. జిల్లా చరిత్రలోనే సుదీర్ఘకాలంగా 15 ఏళ్లు జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఓ వైపు పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి సాగిస్తూనే అనేక ప్రజా ఉద్యమాలకు సారథ్యం వహించారు. అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా.. రాష్ట్రంలోనే తొలి బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించి రైతు సమస్యలపై గళ మెత్తారు.
అఖిలపక్ష నేతల నివాళులు..
1996లో సుజాత నగర్ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేశారు. సీపీఐ కార్యాలయంలో టీవీ చౌదరి పార్థీవ దేహానికి తెరాస, కాంగ్రెస్, సీపీఎం, న్యూడెమోక్రసీ నేతలు నివాళులు అర్పించారు. నీతి, నిజాయతీతో ఉన్న వ్యక్తిని కోల్పోవడం ఖమ్మం జిల్లాకే తీరని లోటని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు గుర్తు చేసుకున్నారు.
టీవీ చౌదరిని కడసారి చూసి వీడ్కోలు పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి కమ్యూనిస్టు శ్రేణులు తరలివచ్చాయి. లాక్డౌన్ అమలు నేపథ్యంలో కొద్ది మంది శ్రేణుల సమక్షంలో టీవీ చౌదరి అంత్యక్రియలు నిర్వహించారు.