ఖమ్మం నగరపాలక సంస్థలో అధికార పక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పాలకవర్గంలో అంతర్గత, ఆధిపత్య పోరు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. మేయర్ పాపాలాల్ - కార్పొరేటర్ల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం చినికి చినికి గాలివానగా మారుతోంది. మేయర్‌కు వ్యతిరేకంగా మూకుమ్మడిగా జట్టుకట్టిన అధికారపక్షానికి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు... వరుసగా రెండ్రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. ఎట్టిపరిస్థితుల్లో మేయర్‌ను తప్పించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు.
తాడోపేడో తేల్చుకునే దిశగా అడుగులు...
పాలకవర్గం గడువు ఇంకా 20 నెలలే ఉన్నప్పటికీ...నగర అభివృద్ధిలో సొంతపార్టీ కార్పొరేటర్లను కలుపుకొని పోకుండా... ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇక ఆయనతో కలిసి సాగలేమని ప్రకటించారు. ఇందులో భాగంగా మేయర్ పై అవిశ్వాస తీర్మాన ప్రతిని సిద్ధం చేసిన ప్రజాప్రతినిధులు...ఈ ప్రతిని జిల్లా కలెక్టర్‌కు అందించాలని తొలుత భావించారు. కాని ముందుగా పార్టీ ముఖ్యనేతలతోనే తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. నగరపాలకసంస్థలో తెరాసకు 39 మంది కార్పొరేటర్ల బలం ఉండగా...గురువారం జరిగిన సమావేశంకు 37 మంది హాజరయ్యారు. వీరంతా మూకుమ్మడిగా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యేను కలువనున్న కార్పొరేటర్లు... మేయర్‌ను గద్దె దింపాలంటూ వారు చేసిన తీర్మాన ప్రతిని ఆయనకు అందజేయనున్నారు.
సొంత ప్రయోజనాలను అడ్డుకున్నందుకే...
అసమ్మతి సెగలపై తనదైన శైలిలో మేయర్ పాపాలాల్ సమాధానమిస్తున్నారు. అధికార పార్టీలో ఉండి స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నారంటూ అసమ్మతి శిబిరంలోని ఐదారుగురు కార్పొరేటర్లపై మండిపడుతున్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడమే కాకుండా, కార్పొరేషన్లో నిత్యం పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులుగా ఉంటూ కాంట్రాక్టర్ల అవతారమెత్తిన వారి ఆగడాలను అడ్డుకోవడం వల్లే తనపై అసమ్మతికి తెరలేపారని పేర్కొన్నారు.
ఇప్పడిప్పుడే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ సంస్థగతంగా బలోపేతం అవుతుదనుకుంటున్నా తెరాస ఆశలపై నగరపాలక కార్పొరేటర్లు నీళ్లు పోసినంతా పనిచేస్తున్నారు. ఏకంగా మేయర్‌పై అసమ్మతికి తెరలేపడం అధికారపార్టీకి అంతు చిక్కటం లేదు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వద్దనే ఉద్దేశంతో అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ల డిమాండ్ మేరకు...మేయర్ పాపాలాల్‌ను తప్పించి మరో వ్యక్తిని మేయర్‌గా నియమించ వచ్చనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇదే సమయంలో పాలకవర్గాన్ని రద్దు చేస్తారన్న ఊహాగానాలు లేకపోలేదు. ప్రస్తుతం ఖమ్మంలో ప్రతిపక్ష పార్టీలు నామమాత్రంగానే మారడం, నియోజకవర్గ బాధ్యతలు తీసుకునే నేతలు లేకపోవడం వంటి పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలుచుకొని...మరోసారి అధికార పీఠం అందుకోవాలని తెరాస యోచిస్తున్నట్లు తెలుస్తోంది.