CP Vishnu Says No Disruption To Janagarjana Sabha : ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జన గర్జన భారీ బహిరంగ సభకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే.. పోలీసులు ఆటంకం సృష్టిస్తున్నారన్న కాంగ్రెస్ నేతల వాదనలో వాస్తవం లేదని ఖమ్మం సీపీ విష్ణు స్పష్టం చేశారు. కాంగ్రెస్'జనగర్జన' సభకు అడ్డంకులు సృష్టించడం లేదని ఆయన పేర్కొన్నారు. సభకు వెళ్తున్న వాహనాలను అడ్డుకుంటున్నామన్న వార్తలు అన్నీ అవాస్తవమని తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్ మినహా ఎక్కడా కూడా చెక్‌పోస్టులు పెట్టలేదని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేయవద్దని సీపీ కోరారు. ఇలాంటి వాటిపై తప్పుడు ప్రచారం చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఖమ్మం సీపీ విష్ణు హెచ్చరించారు.
కాంగ్రెస్ నేతలు మాట్లాడేవి అన్నీ అసత్యాలే : మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ లేదా బీజేపీ చేపట్టిన ఏ సమావేశానికైనా.. అడ్డంకులు సృష్టించలేదని ఖమ్మం బీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధు తెలిపారు. ప్రియాంక గాంధీ మీటింగ్‌కు సైతం ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా.. ప్రభుత్వం సహకరించిందని పేర్కొన్నారు. ప్రజలు సభకు రాకుంటే బీఆర్ఎస్పై నెపం వేస్తున్నారన్నారు. ప్రజలలో ఆదరణ లేకనే ప్రభుత్వం.. బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కాంగ్రెస్ అన్నీ అసత్య ఆరోపణలు మాత్రమే చేస్తుందని.. కాంగ్రెస్ నాయకులకు అంగబలం, అర్ధబలం ఉంది కానీ ప్రజల్లో ఆదరణ లేదని ఆరోపణలు చేశారు.
సభకు హాజరు కాకుండా పోలీసు అడ్డుకుంటున్నారు : జనగర్జన సభకు వెళుతున్న వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ సమావేశానికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పొంది.. కార్యకర్తలు ప్రయాణిస్తున్న వాహనాలను అనవసరంగా సీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే.. ఇలా చేస్తున్నారని తీవ్రస్థాయిలో కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. వాహనాల తనిఖీల పేరుతోనూ.. సీబుక్, లైసెన్స్‌లను తీసుకుని వాహనాలను సీజ్ చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలను పోలీసులు, రెవెన్యూ శాఖ సిబ్బంది సంయుక్తంగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
Congress Janagarjana Sabha In Khammam : అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి వెళ్తున్న కాంగ్రెస్ వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారని.. సభకు వెళ్లకుండా తనిఖీల పేరుతో అడుగడున ఆటంకాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు. ఎక్కడికక్కడ పోలీసులు వాహనాలను అడ్డుకుంటున్నారని.. తనిఖీల పేరుతో పోలీసులను రవాణాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారని విమర్శించారు. ప్రతి ఒక్కరిని ఏదో ఒక కారణం చెప్పి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే పోదెం వీరయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పెద్ద కార్యక్రమం జరిగినా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన కొమ్ము నృత్య కళాకారులు ప్రదర్శన చేయడానికి వెళతారని.. వారి వాహనాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు.
ఇవీ చదవండి :