BRS Sitting MLAs in Tension : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే ఎమ్మెల్యేగా గెలుపొందారు. మిగతా 9 చోట్ల పార్టీ పరాజయం పాలైంది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఇద్దరు, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో కారు పార్టీ బలం 8కి చేరింది. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కారు పార్టీ పూర్తి పట్టు సాధించి విజయకేతనం ఎగురవేసింది. స్థానిక సంస్థలు, డీసీసీబీ ఎన్నికల్లో కారు హవా కొనసాగింది. గతేడాది జిల్లా నుంచి వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిలకు రాజ్యసభ ఎంపీలుగా అవకాశం కల్పించారు. ఇలా ఉమ్మడి జిల్లాలో నాయకత్వపరంగా, పార్టీ పరంగా అత్యంత బలమైన పార్టీగా బీఆర్ఎస్ ఉంది.
Khammam BRS Sitting MLAs in Tension : ఇదే అంచనాతో నాలుగైదు నెలల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు గులాబీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. ఇదే తరుణంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతుండటం పార్టీ అధి నాయకత్వాన్ని కలవరపెడుతుండగా.. నలుగురైదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా దళితబంధు పథకంలో కొంతమంది ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడ్డట్లు తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ హెచ్చరించడమే కాకుండా.. పద్ధతి మార్చుకోకపోతే వారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో పలువురు ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు.
BRS Sitting MLAs in Tension in Khammam District : అంతేకాదు.. ఈ నెల 17న జరిగిన పార్టీ విస్త్రృత స్థాయి సమావేశంలోనూ ప్రభుత్వం, పార్టీ చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారని సీఎం వ్యాఖ్యానించడం, మీకు రిబ్బన్ కటింగ్లు తప్ప ఏం తెలియదని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అసహనం వ్యక్తం చేయడంతో జిల్లాలో పరిస్థితి మొత్తం తనకు అవగాహన ఉందన్న హెచ్చరికలు పంపడం.. ప్రజాప్రతినిధులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలుమార్లు సిట్టింగులకే సీట్లు ఇస్తామంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ.. ఇటీవల జరిగిన రెండు సమావేశాల్లోనూ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండటంతో పలువురు సిట్టింగుల్లో గుబులు రేపుతోంది.
ఒక్కొక్కరి నుంచి రూ.2 నుంచి రూ.3 లక్షలు.. : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో తొలి దఫా దళితబంధు పథకంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారుల అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ప్రజాప్రతినిధులే వారి కుటుంబీకులు, ముఖ్య అనుచరుల ద్వారా వసూళ్ల పర్వానికి తెరలేపారన్నది రాజకీయ వర్గాల్లో బహిరంగ రహస్యమే. ఖమ్మం జిల్లాలో ఓ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దళితబంధు పథకాన్ని ఫలహారంగా అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారుకు వచ్చే రూ.10 లక్షల్లో ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. ఇందుకోసం సదరు ఎమ్మెల్యే ఏకంగా లబ్ధిదారుల నుంచి ప్రామిసరీ నోట్లు రాయించుకున్నట్లు ప్రచారం ఉంది.
ఎమ్మెల్యేలను పక్కనబెట్టి.. వారే అన్నీ తామై.. : రెండో దఫా దళితబంధు పథకానికి ఇంకా అర్హుల ఎంపికే మొదలుకాకున్నా.. ఆ ఎమ్మెల్యే మాత్రం మళ్లీ పథకం ఎర చూపి రూ.లక్షల్లోనే దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ముగ్గురు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై వసూళ్ల ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ఓ నియోజకవర్గంలో దళితబంధు పథకం లబ్ధిదారుల నుంచి ఇద్దరు ప్రజాప్రతినిధుల కుటుంబీకులు రంగంలోకి దిగి వసూళ్లకు పాల్పడ్డారన్నది బహిరంగమే. ప్రజా ప్రతినిధుల కన్నా.. వారి కుటుంబ సభ్యుల ఆధిపత్యమే జోరుగా సాగుతోంది. అభివృద్ధి పనులు, పార్టీ కార్యక్రమాలన్నీ అన్నీ తామై ఎమ్మెల్యేలను పక్కనబెట్టి వారే చక్కబెడుతున్నారన్నది బహిరంగ రహస్యం. అంతేకాదు.. దళితబంధు పథకంలోనూ అన్నీ తామై వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఎప్పటికప్పుడు అధిష్ఠానం ఆరా.. : అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు లోతుగా పరిశీలిస్తోంది. వివిధ సర్వేల ద్వారా ప్రజాప్రతినిధుల పనితీరును తెలుసుకుంటోంది. నిఘా వర్గాలు సైతం నియోజకవర్గాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాయి. ఉభయ జిల్లాల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పక్కాగా నిఘా పెట్టిన నేపథ్యంలో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టంగుల సీట్లు గల్లంతు కావడం ఖాయమన్న ప్రచారం గులాబీ పార్టీలో జోరుగా సాగుతుండటం గమనార్హం.
ఇవీ చూడండి..
దళిత బంధులో భారీ అక్రమాలు.. లబ్దిదారుల నుంచి లక్షల్లో దోపిడీ!