BRS Praja Ashirvada Sabha at Sathupalli : ఆరు నూరైనా ఈసారి మళ్లీ గెలిచేది.. బీఆర్ఎస్ పార్టీయే అంటూ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో కూడా పెట్టని ఎన్నో పథకాలు అమలు చేశామని అన్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో జరిగిన ఆ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఓట్ల కోసమే దళిత బంధు(Dalit Bandhu Scheme in Telangana)ను తెచ్చి ఉంటే.. మేనిఫెస్టోలో పెట్టేవాళ్లమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 100 శాతం దళితబంధు అమలు చేశామన్నారు. ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క నియోజకవర్గంలోనే ఒక మండలం మొత్తం దళితబంధును అమలు చేశామని చెప్పారు. దళితబంధు అనే పదం పుట్టించిందే కేసీఆర్ అని.. కేసీఆర్ కంటే ముందు ఎవరైనా ఈ పథకం గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు.
CM KCR About Dalit Bandhu : 75 ఏళ్లు గడిచినా ఎస్సీల పరిస్థితి బాగాలేదని.. వారు ఎప్పటికీ అలాగే ఉండాల్సిందేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు దశాబ్దాలుగా వారిని ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళిత జ్యోతి అనే కార్యక్రమం అమలు చేశామని గుర్తు చేశారు. దళితబంధుకు స్ఫూర్తి.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమలు చేసిన దళితజ్యోతే అంటూ వివరించారు. అందుకే ఎవరిని గెలిపిస్తే.. ఏం జరుగుతుందో ఆలోచించాలని సూచించారు.
"డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ.. సింగిల్ రోడ్డు వచ్చిందంటే ఆంధ్ర. మనం ఎట్లా బతుకుతామో ఏమోనని వాళ్లు బాగా బెంగపడ్డారు. ఆంధ్రవాళ్లు తెలంగాణ నుంచి వెళ్లిపోతే మీకు పరిపాలన చేతనవుతుందా అన్నారు. ఇప్పుడు వాళ్లు వచ్చి మన దగ్గర వరి ధాన్యం అమ్ముకుంటున్నారు. మన దగ్గర డబ్బులు వెంటనే ఇస్తున్నాము. అన్ని తేడాలు మీకు కనిపిస్తాయి. నాటి సీఎం కిరణ్కుమార్ రెడ్డి తెలంగాణ కటిక చీకటి అయిపోతుందని అన్నారు. ఈనాడు మన దగ్గర విద్యుత్ వెలుగుజిలుగులు ఉన్నాయి.. వారి దగ్గరే చీకట్లు ఉన్నాయి." - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
CM KCR Fires on Congress : ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ నేతను అసెంబ్లీ గేటు తాకనీయనంటూ అహంకారంతో మాట్లాడారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో.. ఆలోచించాలని అన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో చూడాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు. ధరణి తీసేస్తే.. రైతు బంధు, రైతు బీమా(Rythu Bhima in Telangana) అన్నీ పోతాయన్నారు. కాంగ్రెస్ గెలిస్తే 24 గంటల కరెంటు కాటిలో కలుస్తుందని చెప్పారు. ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ అనే పిచ్చి పట్టుకుందన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమంటే పెట్టమని బెదరకుండా కేంద్ర ప్రభుత్వానికి తెగేసి చెప్పామన్నారు.
తెలంగాణ రోడ్లు.. ఏపీ రోడ్లు చూడండి : తెలంగాణ ఇస్తే ఎలా బతుకుతారని ఏపీ నేతలు మాట్లాడారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కటిక చీకటి అవుతుందని ఆనాటి సీఎం కిరణ్కుమార్ రెడ్డే స్వయంగా అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలు ఏపీ, తెలంగాణ రోడ్లను పరిశీలించాలని కోరారు. ఈ రోడ్లను చూస్తే అభివృద్ధి ఎలా ఉందో తెలుస్తుందన్నారు. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ.. సింగిల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. సరిహద్దుల్లోని ఏపీ ప్రజలు వచ్చి.. ఇప్పుడు తెలంగాణలో వరి ధాన్యం అమ్ముకుంటున్నారని తెలిపారు. నేడు తెలంగాణలో విద్యుత్ వెలుగు జిలుగులు ఉంటే.. తమకు శాపం పెట్టినవాళ్లు చీకట్లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు.