Bandi Sanjay: ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో అనేక అరాచక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో రోజురోజుకూ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్న సీఎం కేసీఆర్, హోంమంత్రి ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. నేరస్థుల విషయంలో తగిన చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు జరిగేవి కావన్నారు. ముఖ్యమంత్రి 95శాతం ప్రగతిభవన్, ఫామ్ హౌస్‌కే పరిమితమవుతున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. ఖమ్మంలో ఆత్మహత్యకు పాల్పడ్డ భాజపా కార్యకర్త సాయిగణేశ్ కుటుంబీకులను బండి సంజయ్ పరామర్శించారు. సాయిగణేశ్ అమ్మమ్మ సావిత్రమ్మను ఓదార్చారు.
పార్టీ తరపున ఖమ్మంలో కొనుగోలు చేసిన ఇంటికి సంబంధించిన పత్రాలను సావిత్రమ్మకు అందజేశారు. పార్టీ సాయిగణేశ్ కుటుంబీకులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సాయిగణేశ్ ఆత్మహత్యకు బాధితులైన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించామన్న బండి సంజయ్.. సీబీఐ విచారణ కోరామని వెల్లడించారు. సాయిగణేశ్ ఆత్మహత్య ఘటనలో మంత్రి పువ్వాడను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు.. కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందని.. త్వరలోనే బొందపెడతామని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అవినీతిలో సీఎంవోకు వాటాలు ముడుతున్నాయని బండి ఆరోపించారు. భాజపా అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేల్చుతామని సంజయ్ స్పష్టం చేశారు.
"రౌడీలు, హంతకులు, దోపిడీదారులు, దొంగలు, కబ్జాదారులు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యమేలుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. దీనికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు సహా తెరాస నేతలే దీనికి బాధ్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాయితీపరుడైతే, నిబద్ధత గలవాడైతే నేరస్థుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాడు. పేద ప్రజలను అరిగోసలు పెడుతున్నరు, జలగల లాగా రక్తం పీలుస్తున్నరు. కనీసం కంట్రోల్ చేయాలనే సోయి లేదంటే.. నీ కంట్రోల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు లేరు. నువ్వు ప్రశ్నిస్తే నీ బండారం బయటపెడుతారు. స్థానిక మంత్రికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. సాయిగణేశ్ ఆత్మహత్య ఘటనలో మంత్రి పువ్వాడను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం." -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: