ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని పరిసర గ్రామాల్లో ఓ కూరగాయల బండి కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు. ఒకరోజు రాకపోయినా ఎందుకు రాలేదని ఆ రైతుకు ఫోన్ చేస్తారు. ఇదేంటి ఆ రైతు అంత ప్రత్యేకం... ఆ కూరగాయలకు అంత డిమాండ్ ఏంటనుకుంటున్నారా... అతడు పండించేది సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు అందుకే వాటికంత గిరాకి.
విభిన్నంగా సేంద్రియ వ్యవసాయం
కందుకూరుకు చెందిన బండి సుధాకర్ రెడ్డి తనకున్న నాలుగెకరాళ్లో గత పదేళ్లుగా ఆకుకూరలు పండిస్తున్నాడు. మొదట్లో రసాయనిక ఎదువులతోనే సేద్యం చేసేవాడు. అందుకు భిన్నంగా విషతుల్యమైన ఎరువులు వాడకుండా సేద్రియ వ్యవసాయం ప్రారంభించాడు. జీవామృతంతో ఆకుకూరలు పండిస్తూ ఆరోగ్యకరమైన పంటసాగుపై పట్టుసాధించాడు. మొదట్లో అంతగా ఆసక్తి చూపకపోయినా రానురాను ఇతని పంటలపై వినియోగదారు నుంచి డిమాండ్ పెరిగింది.
ఆకుకూరలంటే ఇతనే గుర్తొస్తాడు
గత ఐదేళ్లుగా సేంద్రియ వ్యవసాయం ద్వారా తోటకూర, బచ్చలకూర, మెంతికూర, పాలకూర తదితర ఆకుకూరలు పండిస్తూ తన సొంత వాహనంలో తీసుకెళ్లి వేంసూరు పరిసర గ్రామల్లో విక్రయిస్తున్నాడు. ఇతని కృషికి మెచ్చి ఆత్మ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నాడు. పర్యావరణానికి మేలు చేసే సేంద్రియ వ్యవసాయంపై ప్రభుత్వం దృష్టి సారించి ఈ విధమైన సాగును ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు. విద్యావంతులైన యువ రైతులు సేంద్రియ సాగులో వ్యవసాయ రంగానికి జీవం పోయాలి.