YSRTP President YS Sharmila Visited Sirisilla: నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ప్రభుత్వం చేస్తున్న ఆత్మహత్యలేనని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. సిరిసిల్ల జిల్లాలో షర్మిల పర్యటించి.. ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబాన్ని పరామర్శించి.. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
నిరుద్యోగ సమస్యతోనే నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే నిరుద్యోగంలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని వెల్లడించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ప్రభుత్వం చేస్తున్న ఆత్మహత్యలే అని విమర్శించారు. ఇది బంగారు తెలంగాణ కాదు..ఆత్మహత్యల తెలంగాణ.. బార్ల తెలంగాణ.. బీర్ల తెలంగాణ అని ఆమె ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
YS Sharmila Angry With KTR: ఏడాది క్రితం మార్చి 9న అసెంబ్లీ సాక్షిగా 88వేల ఉద్యోగాలు అంటూ.. ప్రకటన చేసి నేటికి ఏడాది పూర్తి అయ్యిందని గుర్తు చేశారు. ఎక్కడా ఈ జాబ్ క్యాలెండర్ అని ప్రశ్నించారు. ఈ నాయకులే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1 రాయవద్దని రెచ్చగొట్టారు.. మరి ఈ తొమ్మిదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడం చేతకాలేదా అని విమర్శించారు. తన బిడ్డ ఓడిపోతే జాబ్ లేదని.. వెంటనే ఎమ్మెల్సీ జాబ్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవాలి.. కేసీఆర్ బిడ్డలు మాత్రం రాజ్యమేలాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగ ప్రకటనపై శ్వేతపత్రం విడుదల చేయాలి: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో కంప్యూటర్ నుంచి పేపర్ లీక్ అయితే నాకేం సంబంధం అని కేటీఆర్ అంటున్నారు.. ఇదేనా ఐటీశాఖ మంత్రిగా మీ తీరని కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. అంగట్లో పేపర్లు అమ్మడం ట్రాన్ఫరెన్సీనా లేక 33 లక్షల మంది జీవితాలతో ఆడుకోవడం ట్రాన్ఫరెన్సీనా.. ఇద్దరికే తెలియాల్సిన పాస్‌వర్డ్ అందరికీ తెలియడం ట్రాన్ఫరెన్సీనా అంటూ మంత్రిపై విరుచుకుపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు కదా.. మీకు దమ్ముంటే ఆ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. పరీక్షలను రద్దు చేసి వెంటనే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు.
"నవీన్ అనే యువకుడు ఉద్యోగం లేని కారణంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఉద్యోగ సమస్యపై గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తీవ్రతరం అయ్యింది. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. నిరుద్యోగ భృతిగా ప్రతి నెల రూ.3016 ఇస్తానన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేస్తున్న ఆత్మహత్యలే." - వైఎస్ షర్మిల, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు
ఇవీ చదవండి: