Women protest against liquor stores cherlabuthkur: ఇళ్ల మధ్య మద్యం షాపు ఏర్పాటు వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా చెర్లబుత్కూర్ గ్రామంలో ఇళ్ల మధ్యలోనే లిక్కర్ షాపు తెరవడంతో... సాయంత్రం అయిందంటే చాలు మందుబాబులతో గందరగోళంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో నుంచి బయటకు రావడం కష్టంగా మారిందని... గ్రామంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వైన్ షాపు ఉండడం వల్ల తాగుతున్నారు. వాసన వస్తోంది. మాకు ఇబ్బంది అవుతోంది. మాకు ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవు. వైన్స్ ఇక్కడి నుంచి తీసేసే ప్రయత్నం చేయాలి. సీసాలు పగలగొడుతున్నారు. మా ఇంటి మొఖాన విసిరేస్తున్నారు. ఇంట్ల నుంచి ఇవతలికి రావాలంటేనే భయంగా ఉంది.
-గ్రామస్థురాలు
cherlabuthkur Women strike: ఇళ్ల మధ్య మద్యం దుకాణం... వద్దు.. వద్దు.. అంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు. నివాస ప్రాంతంలో లిక్కర్ షాపు ఉండడం వల్ల... మద్యం సేవించిన వారితో ఇబ్బందులు కలుగుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ సీసాలు తమ ఇళ్ల వైపు విసిరేయడం, సీసాలు పగలగొట్టడం, వెకిలి చేష్టలు చేస్తున్నారని వాపోయారు. పారిశుద్ధ్యం కొరవడుతోందని మహిళలు అసహనం వ్యక్తం చేశారు. గ్రామంలో మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మద్యం దుకాణాన్ని వేరే దగ్గరకు తరలించాలని మహిళలు డిమాండ్ చేశారు.
వెకిలి చేష్టలు, సిగరెట్లు కాల్చడం, పేపర్లు కాలబెట్టడం... మాకు ఘోరంగా ఇబ్బంది అవుతోంది. సాయంత్రం ఐదు అయిందంటే చాలు బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. బూతులు మాట్లాడుతున్నారు. మేం వినలేకపోతున్నాం. ఆ షాపు అక్కడి నుంచి తీసేయాలి.
-గ్రామస్థురాలు
ఇదీ చదవండి: students strike in alampur: మద్యం దుకాణాలు తొలగించాలంటూ విద్యార్థుల ఆందోళన