మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోడానికి అధికార తెరాస వ్యూహరచన చేయడంతోపాటు అభ్యర్థిని కూడా ప్రకటించింది. తెరాసను వీడి భాజపా అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఈటల రాజేందర్ ఇప్పటికే నియోజక వర్గం అంతా చుట్టేశారు.
అభ్యర్థి కోసం తర్జన భర్జన
గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి... హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకోవడంతో అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టింది కాంగ్రెస్. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత జరుగుతున్న మొదటి ఉపఎన్నిక కావడంతో సత్తాచాటాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. పార్టీ క్యాడర్‌లో జోస్ వచ్చినప్పటికీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జనలు పడుతోంది. కాంగ్రెస్ పార్టీ గతంలో మాదిరిగా కాకుండా ప్రజాధారణ కలిగిన వ్యక్తిని బరిలో నిలిపేందుకు వ్యూహాత్మకంగా యోచిస్తోంది.
నియోజకవర్గంలో ఇంఛార్జుల నియామకం
ఓవైపు అభ్యర్థి కోసం అన్వేషణ కొనసాగిస్తూనే... మరోవైపు హుజురాబాద్‌లో పార్టీ బలోపేతానికి అన్ని మండలాలు, ముఖ్యమైన పట్టణాలకు ఇంఛార్జులను నియమించింది. నియోజకవర్గ బాధ్యతలను ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహకు అప్పగించారు. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముఖ్యనేతలు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు.
అభ్యర్థి ఎంపిక కీలకం
హుజురాబాద్‌లో పార్టీ స్థితిగతులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పలు సార్లు సమీక్ష చేశారు. ఇప్పటికే స్థానిక నేతలు... నియోజకవర్గంలోని అయిదు మండలాలు, రెండు మున్సిపాలిటీలలో తరచు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయ్యితే హుజురాబాద్‌లో అభ్యర్థి ఎంపిక విషయంలో సామాజిక వర్గం, పార్టీ కోసం పని చేసే వ్యక్తి కావాలని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజానర్సింహ కలిసి సిఫారసు చేయాలని స్పష్టం చేశారు.
తెరపైకి కొండా సురేఖ పేరు..
సామాజిక సమీకరణాల దృష్ట్యా.. తెరాస, భాజపా... బీసీ అభ్యర్థులను బరిలో దింపగా... ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉన్నందున.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టాలని హస్తం నేతలు యోచిస్తున్నారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పరకాల మాజీ ఎమ్మెల్యే దమ్మాటి సాంబయ్యల పేర్లను కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఎస్సీ అభ్యర్థి బరిలో దిగేందుకు చొరవ చూపకుంటే... మరొక బీసీ అభ్యర్థినే నిలబెట్టాలని యోచిస్తున్నారు. బీసీ అభ్యర్థి అయితే మాజీ మంత్రి కొండా సురేఖను బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారు.
జమున దిగితే... బరిలోకి సురేఖ
భాజపా తమ అభ్యర్థిగా ఈటల జమునను బరిలో నిలిపితే... కాంగ్రెస్ కూడా మహిళ అభ్యర్థునే పోటీకి దింపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. బీసీ అభ్యర్థి అయినా... మహిళా అభ్యర్థి అయినా సురేఖ సరిపోతుంది. అయితే ఇవాళ సాయంత్రం జరగనున్న పీసీసీ ముఖ్య నాయకుల సమావేశంలో అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి కాంగ్రెస్ చేయబోయే ప్రయోగం ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సిందే.
ఇదీ చూడండి: కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభా వేదిక మార్పు