Vending Zones Not Allocated To Beneficiaries : కరీంనగర్‌లో పలు చోట్ల చిరువ్యాపారుల (Street vendors) కోసం, దుకాణ సముదాయాలు నిర్మాణం చేపట్టారు. వీటిని నిర్మించి నెలలు గడుస్తున్నా, వాటిని వ్యాపారులకు అప్పగించడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్రమాలకు తావిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో వెండింగ్ జోన్ల ఏర్పాటులో భాగంగా కొత్తగా దుకాణ సముదాయాలు నిర్మించారు.
Vending Zones in Karimnagar : రోడ్లపై పార్కింగ్ స్థలాలు, నడకదారులు ఆక్రమణకు గురవుతుండటంతో, వీటిని కట్టడి చేసేందుకు పక్కా స్థలాలు కేటాయించి అక్కడే వ్యాపారాలు చేసుకునేలా చర్యలు చేపట్టారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. పండుగల సమయంలో వాహనాలు వెళ్లేందుకు సైతం వీల్లేకుండా ఇబ్బందికరంగా మారుతోంది. ప్రమాదాలను నివారించి వీధివ్యాపారాన్ని పెంచేందుకు వీలుగా షెడ్లను నిర్మించారు.
"ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేయవద్దని షెట్టర్లు నిర్మించారు. ఇప్పటికీ వాటిని మాకు అప్పగించలేదు. నేతలు, యూనియన్ లీడర్ల పేరు చెప్పి కొందరు షెటర్ల తాళాలు తెచ్చుకొని అందులో ఉంటున్నారు. కొందరు షెటర్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారు. మాకు కూడా అలాగే ఇప్పించాలని కోరుతున్నాం. వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించి అద్దె ఖరారు చేయాలి. లెేకుంటే షట్టర్లు కాస్తా ఆక్రమణలకు గురికావడం ఖాయం." - చిరువ్యాపారులు
కొన్ని ప్రాంతాల్లో లక్షలు ఖర్చు చేసి షెడ్లు నిర్మించినా వీధివ్యాపారులు వాటిపై ఆసక్తి చూపడం లేదు. సప్తగిరికాలనీలో 80 మంది వ్యాపారులు కూర్చునే విధంగా అందుబాటులోకి రాగా చైతన్యపురిలో ఖాళీగానే ఉంటుంది. స్మార్ట్‌సిటీలో భాగంగా విద్యానగర్ శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో 25 మంది కోసం షెట్టర్లు నిర్మించారు. పనులన్నీ పూర్తైనా ఎవరికీ అప్పగించకుండా అలాగే వదిలేశారని, దీంతో తమకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గంజ్ మార్కెట్లో దుకాణాలు తెరవాలని వినతిపత్రం
దుకాణాలు ఇప్పిస్తామంటూ దళారుల దందా : ప్రభుత్వాసుపత్రి వెనుక ఉన్న దుకాణాలను ఇప్పిస్తామని చెప్పి కొందరు దళారులు అందినంత దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా దుకాణాలు ఇప్పించాలని కొందరు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. వెండింగ్ జోన్ల కేటాయింపు కోసం విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని మేయర్ సునీల్‌రావు (Mayor Sunil Rao) తెలిపారు. వీటిని ఏ ప్రాతిపదికన కేటాయించాలనే విషయంపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. రహదారి విస్తరణలో నష్టపోయిన వారితో పాటు, రోడ్లపై జీవిస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మేయర్ సునీల్‌రావు వివరించారు.
"దుకాణాల నిర్మాణాలు పూర్తయ్యాయి. విద్యుత్ సౌకర్యం కల్పించి అద్దె ఖరారు చేయాల్సి ఉంది. సప్తగిరికాలనీలో 80 మంది వ్యాపారులు కూర్చునే విధంగా అందుబాటులోకి తెచ్చాం. విద్యానగర్ శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో 25 మంది కోసం షెట్టర్లు నిర్మించాం. రోడ్డు వెడల్పులో నష్టపోయిన వీధివ్యాపారులకే వీటిని కేటాయించడం జరుగుతుంది. వీటిని ఎలా అప్పగించాలనే విషయంపై కౌన్సిల్‌లో తీర్మానం చేసి నిర్ణయం తీసుకుంటాం." - సునీల్‌రావు, కరీంనగర్ మేయర్
దుకాణాల నిర్మాణాలు పూర్తైనావాటిని ఏవిధంగా అప్పగించాలనే విషయంలో సందిగ్ధత నెలకొంది. పాలకవర్గం స్పందించి నిజమైన లబ్ధిదారులకు షెడ్లను అప్పగించాలని ఆశావహులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే షట్టర్లు కాస్తా ఆక్రమణలకు గురికావడం లేదా శిధిలావస్థకు చేరుకుంటాయని చిరువ్యాపారులు సూచిస్తున్నారు.