కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిని విస్తరించి శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ ' సుడా'ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని పరిధిలోకి 71 గ్రామాలు తీసుకొస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 2011లో వచ్చిన ఈ ఆదేశాలపై అప్పుడే అభ్యంతరాలు వచ్చాయి. తరువాత సమయానుకూలంగా బొమ్మనకల్, చింతకుంట గ్రామాలు మినహాయించి పద్మాగర్, అల్గునూరు, సదాశివనగర్, రేకుర్తి, ఆరెపల్లి, సీతారాంపురం, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్ గ్రామాలు విలీనం చేశారు. అప్పటి నుంచి అసలు సమస్య మొదలైంది. కార్పొరేషన్లో విలీనమైన తర్వాత పన్నుల భారం పెరిగింది కానీ.. అభివృద్ధి జరిగిందేమీ లేదని స్థానికులు ఆందోళనకు దిగారు.
పరిస్థితిని గ్రహించిన కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, కమిషనర్ సత్యనారాయణ అధికారులతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి ఆలస్యంపై ఆరాతీశారు. విధి నిర్వహణలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తమ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించడం పట్ల శివారు ప్రాంతవాసులు స్వాగతిస్తున్నారు.
ఇవీ చూడండి: అక్రమంగా ఇసుకు తరిలించే వారిపై నిఘా