హుజురాబాద్ ఉపఎన్నిక (Huzurabad By Election) నామినేషన్లు తొలిరోజు నుంచే ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. అధికార తెరాస 20 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(Ec)కి సమర్పించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr), తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (Ktr), మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, వి. సతీశ్ కుమార్, దాసరి మనోహర్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి సహా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య పేర్లను సమర్పించింది.
ఊసరవెళ్లి...
ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు కరీంనగర్ జడ్పీ ఛైర్పర్సన్ కనుమళ్ల విజయ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌తో పాటు ఇటీవల తెరాసలో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డిని కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తెరాస చేర్చింది. భాజపా నేత ఈటల రాజేందర్‌కు రంగులు మార్చే ఊసరవెల్లికి తేడా లేదని ప్రభుత్వ చీఫ్ విప్ బాల్కసుమన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటల తన ఆత్మగౌరవాన్ని గుజరాతీల వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు.
మూల్యం తప్పదు...
దళితబంధు వద్దని లేఖ రాసినట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా నేత ఈటల రాజేందర్ (Etela Rajender) తెలిపారు. అది తప్పుడు ప్రచారమని ఏకంగా ఎన్నికల కమిషనే స్పష్టం చేసిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ధర్మంతో గొక్కున్నారని మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఈటల... భాజపా నాయకులపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారని ఆరోపించారు.
రాజ్యాంగం ఏమి చేస్తుందో అర్ధం కావడం లేదని జాతీయ పార్టీ అయిన భాజపాకే ఈ పరిస్థితి ఉందంటే తెరాస దౌర్జన్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని ఈటల పేర్కొన్నారు. ఏ పథకం కావాలన్నా ఇంటిమీద తెరాస జెండా ఉండాలంటున్నారని... రాష్ట్రం మీ జాగీరా అంటూ ప్రశ్నించారు. తన రాజీనామాతో ఎన్నో పథకాలు వచ్చాయన్న ఈటల... తాను గెలిస్తే తెలంగాణ రాజకీయ చరిత్ర మారుతుందని తెలిపారు. ఉపఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేశారు.
ఇదీచూడండి: Huzurabad by election: హుజూరాబాద్ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్