హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయంపై అధికార తెరాస ధీమాతో ఉంది. భారీగా జరిగిన పోలింగ్ తమకే అనుకూలమని గులాబీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపించబోతున్నాయనే నమ్మకంతో ఉన్నారు. తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పోలింగ్‌ను నిరంతరం సమీక్షించారు. హరీశ్ సహా ఇతర ముఖ్యనేతలతో కేసీఆర్ ఫోన్‌లోమాట్లాడుతూ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కచ్చితంగా విజయం సాధిస్తామని పార్టీ నేతలు వివరించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస గొప్ప విజయం సాధించబోతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా పార్టీ విజయం కోసం కష్టపడిన ఓటర్లందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ ఓటర్లు చైతన్యాన్ని ప్రదర్శించారని పేర్కొన్న హరీశ్.. సీఎం కేసీఆర్ మార్గదర్శకంతో.. ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నామని స్పష్టంచేశారు.
హుజురాబాద్ గడ్డపై కమలం జెండా ఎగరబోతుందని భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 86 శాతానికు పైగా నమోదైన పోలింగ్ తమకే కలిసి వస్తోందని ఆ పార్టీ భావిస్తోంది. తెరాస సర్కార్ మీద ఉన్న ప్రజావ్యతిరేకత, ఈటల రాజేందర్ మీద ఉన్న సానుభూతి ఆయన చేసిన అభివృద్దే భాజపా గెలుపుకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. అధికార పార్టీకి ధీటుగా వ్యూహాత్మకంగా చేసిన ప్రచారం కలిసి వస్తోందని భావిస్తున్నారు. ఈటల రాజేందర్‌ను ఓడించేందుకే అధికార పార్టీ కోట్ల రూపాయాల పంపిణీతో పాటు అధికార దుర్వినియోగాయానికి పాల్పడినా ప్రజలు భాజపాకే ఓటు వేశారని పార్టీ నాయకత్వం తెలిపింది. నవంబర్ 2న వెలువడే ఫలితాల్లో 10వేలకు పైగా మెజార్టీతో గెలుస్తామని భాజపా ధీమా వ్యక్తం చేస్తోంది. ఉపఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.తెరాస ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు నిష్పక్షపాతంగా న్యాయం ధర్మం వైపు నిలిచారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం తర్వాత రాష్ట్రంలో రాజకీయ పెనుమార్పులు సంభవిస్తాయని ఈటల గుర్తుచేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే లక్ష 17 వేల 873 మంది ఉండగా వారిలో ఎక్కువ మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం పెరగటంతో అభ్యర్థుల విజయావకాశలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటరు నాడిని అంచనా వేస్తూ నేతలు లెక్కల్లో మునిగిపోయారు. పలువురు నేతలు లోపల ఆందోళన ఉన్నా బయటకు మాత్రం గెలుపు ధీమా కనబరుస్తున్నారు.
ఇదీ చూడండి: