పాఠం సరిగా వినట్లేదని విద్యార్థిని కుర్చీతో కొట్టి కోపం తీర్చుకున్నాడు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వోన్నత పాఠశాలలో కడారి దినేశ్ 9వ తరగతి చదువుతున్నాడు. పాఠాలు చెబుతున్న సమయంలో సదరు విద్యార్థి సరిగ్గా వినటం లేదని ఉపాధ్యాయుడు గమనించాడు. తీవ్ర కోపంతో ఊగిపోయిన ఆయన చేతిలో బెత్తం లేకపోవడంతో పక్కనే ఉన్న కుర్చీతో విద్యార్థిని కొట్టాడు.
ఈ ఘటనలో దినేశ్ కంటి వద్ద గాయమైంది. రక్తస్రావం జరగటాన్ని గమనించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు... మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందించి... ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకుంటామని ప్రధానోపాధ్యాయుడు వెల్లడించారు.