Teacher Beats Students Karimnagar : ఎక్కడైనా స్కూల్లో పిల్లలు అల్లరి చేసినా, తప్పులు చేసినా ఉపాధ్యాయులు దండిస్తారు. హోమ్‌వర్క్ ఎక్కువగా ఇవ్వడమో, గ్రౌండ్‌లో ఉరికించడమో, గోడకు కూర్చి వేయిండం ఇలా చిన్నపాటి శిక్షలు వేస్తుంటారు. బాగా అల్లరి చేస్తే తల్లిదండ్రులను పిలిచి వారితో మాట్లాడతారు. విద్యార్థికి అర్థమయ్యే విధంగా చెబుతారు. కానీ ఈ ఉపాధ్యాయుడు మాత్రం విద్యార్థులు అల్లరి చేస్తున్నారని వారిని గదిలో బంధించి చితక్కొట్టాడు. ఏకంగా 23 మందిని కర్రతో చితకబాదాడు. 'ప్లీజ్ సార్.. వద్దు సార్ మమ్మల్ని వదిలేయండి' అని ఆ పిల్లలు ఎంత బతిమాలినా వినిపించుకోకుండా కర్రలతో విచక్షణారహితంగా కొట్టాడు. ఈ ఘటన కరీంనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీ. తిరుపతి అనే ఉపాధ్యాయుడు జీవశాస్త్రం బోధిస్తున్నాడు. 8వ తరగతి విద్యార్థులు అల్లరి చేస్తున్నారని గదిలో బంధించి విద్యార్థులందరిని విచక్షణ రహితంగా చితకబాదాడు. ఆ పిల్లలంతా కాళ్లు మొక్కుతా సార్ వదిలిపెట్టండి అన్నప్పటికీ 'మీరు పుట్టడమే వేస్ట్ రా' అంటూ ఇష్టానుసారంగా కొట్టారని విద్యార్థులు తమ తల్లిదండ్రులతో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ తల్లిదండ్రులను గురించి అమర్యాదగా మాట్లాడారని విద్యార్థులు ఆరోపించారు.
'మా మంచి హెడ్మాస్టర్'.. సొంత జీతంతో సర్కారు బడికి కొత్త హంగులు
Teacher Suspended for Beating Students Karimnagar : విద్యార్థుల ఒంటిపై గాయాలు చూసిన తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. గొడ్డును బాదినట్టు బాదాడని తిరుపతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే ప్రవర్తించినా బయటకు చెప్పలేదని విద్యార్థులు తెలిపారు. ఈ తరుణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మిగిలిన ఉపాధ్యాయులు అతడిని ఒక గదిలో పెట్టి రక్షించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకొని.. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులను బయటకు పంపించారు. తర్వాత పోలీసులు ఉపాధ్యాయుడిని వెనుక భాగం నుంచి వాహనంలో మూడో ఠాణాకు తరలించారు. కొందరు పాఠశాల ఆవరణలోకి రాళ్లు విసిరారు. బీఆర్‌ఎస్ నాయకుడు ఎడ్ల అశోక్, ఎంఐఎం నాయకులు అబ్బాస్ షమీ, గులాం అహ్మద్ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన చేపట్టిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఎంఈవో మధుసూదనచారి బడికి చేరుకొని వివరాలు సేకరించి డీఈవోకు నివేదిక అందించారు. వివరాలు పరిశీలించిన డీఈవో హామీ ఇచ్చారు. పాఠశాల గదిలో 23 మంది విద్యార్థులను నిర్బంధించి కొట్టినట్లు విద్యార్థులు ఫిర్యాదు చేశారని, ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. బయోలజీ టీచర్ తిరుపతిని సస్పెండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం జిల్లా విద్యాధికారి జనర్దన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.
వృద్ధ టీచర్ని దారుణంగా కొట్టిన మహిళా కానిస్టేబుళ్లు
రంగోలీతో అతి చిన్న సాయిబాబా చిత్రం వేసిన టీచర్ ప్రపంచ రికార్డు దాసోహం