ఒకప్పుడు ధనవంతులు మాత్రమే కార్లు కొనుగోలు చేసేవారు. కరోనా కారణంగా ప్రస్తుతం మధ్యతరగతి వారూ కార్లు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. కొవిడ్ ప్రభావంతో కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో ప్రయాణించిన వారంతా కార్ల కొనుగోలు వైపు దృష్టి సారిస్తున్నారు. కొత్త కార్లు కొనుగోలు చేసే స్థోమత లేని వారు... వినియోగించిన వాటి వైపు చూస్తున్నారు. 70వేల రూపాయల నుంచి 3లక్షల వరకు లభించే వాహనాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో గతంలో 70వేలకు లభించిన కార్లు కాస్త లక్షన్నరకు చేరుకున్నాయని కొనుగోలుదారులు అంటున్నారు.
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేనందున పెట్రోల్ కార్లు కొంటున్నారని విక్రయదారులు చెబుతున్నారు. కార్ల టైర్లు, అద్దాలను బట్టి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించి ఉంటుందో అంచనా వేసుకొని మరీ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో నెలకు 7నుంచి 8వరకు మాత్రమే పాతకార్లను విక్రయించగా... ఇప్పుడు మూడింతలు నాలుగింతలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఫైనాన్స్ కంపెనీలు ఆర్థిక సహాయం చేస్తుండటంతో కొనుగోలుదారుల్లోను కలిసివస్తోందని అమ్మకందారులు చెబుతున్నారు.
వాహనాల కొనుగోలు తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు చెబుతున్న వారికే కొనుగోలుదారులు ప్రాధాన్యతనిస్తున్నారు.
ఇదీ చదవండి: వరద ముంపు ప్రాంతాల్లో రెండో రోజు కేంద్ర బృందం పర్యటన