ఒడిశా వలస కూలీలను తమ స్వగ్రామాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. వలస కార్మికుల కోసం రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్లను సీపీ కమలాసన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ శశాంక పరిశీలించారు. వలస కార్మికులకు పరీక్షల సందర్భంగా కరోనా లక్షణాలు ఉంటే వారిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
సుమారు 170 బస్సులు...
వివిధ జిల్లాల నుంచి కార్మికులను రైల్వేస్టేషన్లకు చేరవేసేందుకు దాదాపు 170 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసింది. ఆయా ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చిన కార్మికులకు మొదట థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. అనంతరం వారి వివరాలు నమోదు చేసి అవసరమైన ఆహార పదార్థాలను అందజేయనున్నట్లు కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు.
మాకు పైసలు వద్దు.. తరలిస్తే చాలు
ప్రత్యేకంగా కొత్త కరీంనగర్ జిల్లా పరిధిలోని కార్మికుల కోసం ప్రత్యేకంగా ఒక రైలును కేటాయించామన్నారు. తర్వాతి రెండు రైళ్లలో నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన కూలీలు ఉంటారని అదనపు కలెక్టర్ తెలిపారు. మరోవైపు తాము గత రెండు నెలలుగా తినడానికి తిండిలేక చాలా ఇబ్బందులు పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తమకు పైసలు అక్కర్లేదని.. తమను స్వగ్రామాలకు పంపిస్తే అంతే చాలని వలస కూలీలు స్పష్టం చేశారు.