Heavy rains in Karimnagar district: కరీంనగర్ జిల్లాలో వడగళ్ల వర్షాలకు యాసంగి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోతదశకు చేరుకున్న వరి పంట వడగళ్ల ధాటికి పొలాల్లోనే రాలిపోయింది. మామిడి కాయలు రాలిపోయి చెట్లు ఖాళీ అయ్యాయి. మిరప పంట చేతికందకుండా పోవడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రకృతి వైపరీత్యాలతో కడగండ్లు మిగిలాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
కరీంనగర్ గ్రామీణ, చొప్పదండి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల మండలాల్లో ఈదురుగాలులు, వడగళ్ల ధాటికి వరి పంట వందల ఎకరాల్లో తుడుచుకుపోయింది. కోతదశకు చేరుకున్న వరి పంట ధాన్యం పొలాల్లోనే రాలిపోయింది. పంట తెగుబడి సర్వం కోల్పోయామని రైతులు వాపోతున్నారు. యాసంగి పంటకాలంలో ఆలస్యంగా వరి నాట్లు వేసుకున్న రైతులకు అకాల వర్షాలు శాపంగా మారాయి. మామిడికాయలకు మార్కెట్లో ధర లేదని.. వేచి చూస్తున్నా రైతులకు ఈదురుగాలుల రూపంలో తీవ్ర నష్టం వాటిల్లింది.
మామిడికాయలతో పాటు చెట్లు కూడా పడిపోయాయి. చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో మిరప తోటలు వడగండ్ల వర్షానికి ధ్వంసమయ్యాయి. ఇటీవల అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ తూకం కోసం నిలువచేసిన ధాన్యం కూడా అకాల వర్షాలకు తడిసిపోయింది. రామడుగు మండలం లక్ష్మీపూర్ రైతుల ధాన్యం కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల కాలువలోకి కొట్టుకుపోయింది. యాసంగి పంట కాలంలో మూడోసారి కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు రైతులకు పెను శాపంగా మారాయి.
"దత్తోజిపల్లి గ్రామంలో ఇరవై ఎకరాలు కౌలుకు తీసుకుని మామిడి, వరి సాగు చేశాను. నిన్న కురిసిన వర్షాలతో పంట మెత్తం నేలపాలైంది. గత నెలలో కురిసిన వర్షాలకు సగం పంట నష్టపోగా.. నిన్న కురిసిన వడగళ్ల వానకు పూర్తిగా నష్టపోయాం. ఇరవై లక్షల రూపాయాల వరకు పంట నష్టం వాటిల్లింది." - మామిడి అంజయ్య, రామడుగు రైతు
"నేను ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేశాం. నిన్న కురిసిన వర్షాలకు పంట మొత్తం నష్టపోయాం. వరిగెలలకు వడ్లన్నీ రాలిపోయాయి. మొత్తంగా తాలు మాత్రమే మిగిలింది. నా ఒక్కడిదే కాదు.. మా గ్రామంలోని రైతులందరూ తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు వరి సాగు చేయడానికి ముప్పై వేల వరకు ఖర్చయ్యింది. పెట్టుబడులు మీద పడ్డాయి". -రాములు, దత్తోజిపేట రైతు
గంగుల కేత్రస్థాయి పర్యటన.. కరీంనగర్ జిల్లాలో శనివారం కురిసిన రాళ్ల వాన, అకాల వర్షాలతో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తిగా పంట నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్.. ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి రైతులలో భరోసా నింపారు. నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం.. రైతుకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: