కరీంనగర్ జిల్లా అధికారుల ఆలోచన ఫలితానికి ఇదో మంచి ఉదాహరణ. జిల్లా వ్యాప్తంగా 487 దుకాణాల వద్ద ఈ నెలలో ప్రయోగాత్మకంగా బియ్యం వితరణ కోసం పెద్ద డబ్బాలను ఏర్పాటు చేశారు. మే నెలకు చెందిన బియ్యాన్ని తీసుకున్న కార్డుదారులు వారికి తోచిన బియ్యాన్ని ఈ డబ్బాలో పోయాలి. ఇలా ప్రతి డీలరు చెంతన ఏర్పాటు చేసి భారీగానే బియ్యం సేకరిస్తున్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ ఆలోచన మేరకు ఇలా పక్కాగా కార్యక్రమం అమలయ్యేలా అందరూ చొరవ చూపారు. సరైన పర్యవేక్షణతో చేపట్టడంతో అన్ని మండలాల్లో మంచి స్పందన లభించింది. మొదటగా కొంతమంది అనాసక్తి చూపించినా తర్వాత ఒకరిని చూసి మరొకరు స్పందించడంతో మంచి ఫలితం కనిపిస్తోంది.
1079 క్వింటాళ్ల సేకరణ..
ఇప్పటివరకు జిల్లాలోని 16 మండలాల పరిధిలోని దుకాణాల చెంతన మొత్తంగా 1079 క్వింటాళ్ల బియ్యం వితరణ రూపంలో అందాయి. కరీంనగర్ పట్టణంలో అత్యధికంగా 184 క్వింటాళ్లు జమవగా.. ఆ తర్వాత హుజురాబాద్ మండలంలో 176 క్వింటాళ్లు, వీణవంక మండలంలో 121 క్వింటాళ్లు, రామడుగు మండలంలో 115 క్వింటాళ్లు పలువురు లబ్ధిదారుల నుంచి అందాయి. ఇలా మొత్తంగా సేకరించిన వెయ్యికిపైగా క్వింటాళ్ల బియ్యాన్ని త్వరలో కార్డులేని నిరుపేదలకు అందించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
ఇలా ఇప్పటికే అక్కడక్కడా 40 క్వింటాళ్ల బియ్యాన్ని రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో పంపిణీ చేశారు. ఈ నెలాఖరు వరకు రేషన్ సరఫరా ఉన్నందున మరో 1500 క్వింటాళ్ల సాయం ఇలా గుప్పెడు బియ్యం ద్వారా అందే వీలుందని డీలర్లు, రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆకలి తీర్చాలని..
జిల్లాలో ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కార్డులేని వారికి బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేశాం. మంచి స్పందన లభిస్తోంది.. మున్ముందు ఇదే విధానాన్ని అవలంబిస్తూ పేదలను ఆదుకునే దిశగా ముందకెళ్తాం. పలువురు కార్డుదారులు సాటి వారి కోసం తమవంతుగా కొంత బియ్యాన్ని ఇస్తామనే ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇది మంచి పరిణామం.
- శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా అదనపు కలెక్టర్