ఉపాధి కోసం ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన కూలీలు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారు.. నాలుగు నెలలుగా ఏ పని లేకపోవడం వల్ల తిరిగి సొంతూళ్లకు పయనమయ్యారు. కరోనా, లాక్డౌన్ కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జిల్లా కేంద్రంలో ఉండేవారు కొంతమందైతే… వేరే ప్రాంతాల నుంచి వచ్చి కూలీ పని చేసుకునే వాళ్లు సైతం పని లేక.. తిరిగి పుట్టిన ఊరి బాట పట్టారు. ప్రైవేటు ఉద్యోగాలపై ఆధారపడిన వారు కూడా.. రోజువారి ఖర్చుల కోసం కూలిపనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మానకొండూరు మండలం లక్ష్మిదేవిపల్లి నుంచి ఉపాధి కోసం వచ్చిన ఓ కుటుంబం గత నాలుగైదు నెలలుగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి దారుణంగా మారడం వల్ల సామాన్లన్నీ సర్దుకొని ఆటోలో సొంతూరుకు పయనమయ్యారు. ఇంటి అద్దె కట్టలేక, తినడానికి తిండి లేక.. పస్తులు ఉంటున్నారు. ఉన్నదేదో తిని.. పుట్టిన ఊళ్లోనే బతుకీడుస్తామంటూ తిరుగుబాట పట్టారు. గత నెలరోజులుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏ రోడ్డులో చూసినా.. ముల్లెమూట సర్దుకొని సొంతూళ్లకు వెళ్లిపోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి.
ఇవీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?