హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఆ దిశగా పార్టీ పెద్దలు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలను, సమన్వయ కర్తలను, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీగా మాజీ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజ నర్సింహను నియమించారు. నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్తలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను ప్రకటించారు. మండలాల వారిగా వీణవంక మండలానికి ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్‌లను, జమ్మికుంట మండలానికి విజయ రమణ రావు, రాజ్ ఠాగూర్‌ను, హుజూరాబాద్ మండలానికి టి. నర్సారెడ్డి, లక్ష్మణ్ కుమార్‌ను, హుజూరాబాద్ పట్టణానికి బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావులను నియమించారు. ఇల్లందకుంట మండలానికి నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలపూర్ మండలానికి కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్యలను, కంట్రోల్ రూమ్ సమన్వయ కర్తగా కవ్వంపల్లి సత్యనారాయణ, నియోజకవర్గ సమాచారం కోసం దొంతి గోపిల పేర్లను ప్రకటించారు.
స్థానిక నాయకులు, ఇంఛార్జీలతో భేటీ
ఈ రోజు ఉదయం గాంధీభవన్‌లో హుజూరాబాద్ స్థానిక నాయకులు, మండల ఇంఛార్జీలతో దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. ఆ నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపైనా చర్చించినట్లు దామోదర రాజనర్సింహ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా వ్యక్తులపై ఆధారపడదని... వ్యక్తుల గురించి మాట్లాడదని స్పష్టం చేశారు. తెలంగాణలో సిద్దాంతపరమైన రాజకీయాలు లేవని.. అంతా కోవర్టు రాజకీయాలేనని ఆరోపించారు. కోవర్టు రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదని పేర్కొన్న ఆయన...కాంగ్రెస్‌లో కోవర్టులెవరున్నారో గుర్తించాల్సి ఉందన్నారు.
పీసీసీ కార్యవర్గం సమావేశం
తాజాగా హుజూరాబాద్ ఉపఎన్నిక విషయమై హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గం సమావేశమైంది. ఈ భేటీలో ఏఐసీసీ ఇంఛార్జీ కార్యదర్శి బోసు రాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్, ఎన్నికల నిర్వహక కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల సమన్వయ కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, కార్యనిర్వహక అధ్యక్షులు జగ్గారెడ్డి, గీతారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నికతోపాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పని చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పీసీసీ కార్యవర్గాన్ని కోరారు.
ఇదీ చదవండి: Khairatabad ganesh 2021: ఈసారి ఖైరతాబాద్ గణేశ్ ఎత్తెంత? ఉత్సవాలు ఎప్పటినుంచి?