కరీంనగర్ నగరపాలక సంస్థకు ఈనెల 24న ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 27న చేపడుతారు. వార్డుల పునర్విభజన సక్రమంగా జరగలేదనే నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులతో ఈనెల 7న కరీంనగర్ నోటిఫికేషన్ వెలువడలేదు. కాగా ఎన్నికలకు హైకోర్టు గురువారం పచ్చ జెండా ఊపింది. దీంతో ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి అనుగుణంగా కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల అధికారి నోటిఫికేషన్ ఇచ్చి ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.
ఎన్నికల్లో అభ్యర్థులకు వెసులుబాటు
పురపాలక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయం నిర్వహణకు గతంలో ఉన్న బ్యాంకు ఖాతాలను వినియోగించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పోటీ చేసే అభ్యర్థి విధిగా కొత్తగా బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుందని గతంలో ప్రకటించింది. ఈ నిబంధనల్లో మార్పులు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరవడంలో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. రిటర్నింగ్ అధికారికి అభ్యర్థులు బ్యాంకు ఖాతా వివరాలను అందించాలంది.
ఇవీ చూడండి: పురపాలక ఎన్నికల్లో ఆ పార్టీలకు గుర్తుల కేటాయింపు..