Private Degree and PG Colleges Bund in Telangana from Today : రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు నేటి నుంచి నిరవధికంగా బంద్ కానున్నాయి. గడిచిన రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్య సంఘాలు తెలిపాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ జిట్టా బాలకిష్టారెడ్డిని కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉన్నత విద్య నిర్లక్ష్యానికి గురవుతోందని వారు వాపోయారు.
దసరా సెలవుల తర్వాత అక్టోబర్ చివరికల్లా డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చినా, అమలుకు నోచుకోకపోవడంతో కళాశాలలను బంద్ చేస్తున్నామని వెల్లడించారు. గతంలో అక్టోబర్ 14 నుంచి 17 వరకు కళాశాలలు మూసివేసినప్పుడు విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారని, దాంతో తరగతులు నిర్వహించామని, ఈసారి డబ్బులు విడుదల చేసేంత వరకు కళాశాలలు తెరిచేది లేదన్నారు. సెమిస్టర్లు సైతం నిర్వహించమని స్పష్టం చేశారు.