కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీరని నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. వరిలో సన్నరకం సాగు చేసిన తెలంగాణ రైతులకు కేంద్రం నష్టం కలగజేస్తుందని విమర్శించారు. విద్యుత్ చట్టంతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని రైతులు, తెరాస పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.
వానాకాలం సాగైన వరి ధాన్యం, పత్తి, మొక్కజొన్న పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. పంటలకు పెట్టుబడి అందించడం దగ్గర నుంచి పంటల కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ తెలంగాణ రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ఐకేపీ సెంటర్లు, కో ఆపరేటీవ్ సొసైటీలు, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. తాలు, పొల్లు లేకుండా ఎండబోసిన వరిధాన్యాన్ని తెచ్చి కనీస మద్దతు ధర పొందాలని, తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని తెచ్చి ఇబ్బంది పడవద్దని ఆయన రైతులను కోరారు.
ఇదీ చూడండి: 'అన్ని రకాల పత్తిని కొనుగోలు చేయాలి'