మట్టితోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల బాధలు వర్ణనాతీతమనీ, ప్రస్తుతం తెరాస ప్రభుత్వం ఆరున్నరేళ్లలో ఏటా దాదాపు రూ.55వేల కోట్లు వ్యవసాయం మీద ఖర్చు చేస్తోందని తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
రాష్ట్రంలో 30లక్షల కరెంట్ మోటార్లు ఉన్నాయని, అవి కాకుండా చిన్న, పెద్ద, మధ్య తరహా నీటి వనరులతో సాగు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యం ఉందని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనంతంగా పారిశ్రామిక వెల్లువ ఉందని, ఏ రంగంలో చూసినా ఉపాధి సంఖ్య పెరిగిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1కోటి 10లక్షల ఎకరాల్లో వరి పండుతుందన్నారు. పంటలు పండుతున్నాయని సంబర పడాలో లేక నూతన సాగు చట్టాలతో బాధ పడాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విడతల వారిగా 2,601 క్లస్టర్లలో ఒక అంశం మీద 2 లేదా 3 రోజుల చొప్పున వివరిస్తూ పంటలపై అవగాహన కల్పిస్తారు. వ్యవసాయ రంగంపై అన్ని విషయాలను అధ్యయనం చేస్తున్నాం. ఆరుతడి పంటలపై శిక్షణ ఇచ్చి లాభాల పంటల సాగువైపునకు మళ్లేలా చూస్తాం. పామాయిల్ వేస్తే అత్యధిక లాభాలను ఆర్జించవచ్చు.
-నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
ఇకనుంచి రైతు వేదికల్లో రైతు దేవుడుంటాడని ఎమ్మెల్యే రసమయి పేర్కొన్నారు. ఎర్రటి ఎండా కాలంలో చెరువులు నింపామని, రాష్ట్రంలో మాత్రమే రైతుబంధు అందజేస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కరీంనగర్ సుడా ఛైర్మన్ జీవీ రామకృష్ణారావు, కరీంనగర్ ఏఎంసీ ఛైర్పర్సన్ ఎలుక అనిత, ఎంపీపీ కేతిరెడ్డి వనిత, జడ్పీటీసీ సభ్యులు ఇనుకొండ శైలజ, మండల తెరాస అధ్యక్షుడు దుండ్ర రాజయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పిల్లలూ చక్కెర తినేస్తున్నారని.. జర జాగ్రత్త!