సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్‌కు మధ్య ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదని.. మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈటలకు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కావాలనే ఆశతోనే ఆయన ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో తెరాస కార్యకర్తల సమావేశానికి మంత్రి హాజరయ్యారు.
![Minister Koppula eshwar participating in the Huzurabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12119142_sdjd.jpg)
తెరాసలో ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ సముచిత స్థానం ఇచ్చారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నాటి నుంచి ఇప్పటివరకు పార్టీలో ఆయనకు ప్రాధాన్యం దక్కిందని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఎంతో చైతన్యవంతమైనదని... ఎన్నికల్లో ఎవరు గెలిచేది ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి పేర్కొన్నారు.
భాజపా... తెలంగాణనే కాకుండా యావత్ దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. నల్ల చట్టాలను తెచ్చిన పార్టీలోకి ఈటల ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఇక్కడ వ్యక్తి కంటే వ్యవస్థ ముఖ్యమని... వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు కానీ... వ్యవస్థ నిలకడగా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది ప్రజారోగ్యం కోసం రూ.10 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ