ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ప్రైవేటుకు దారాదత్తం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఇక రిజర్వేషన్లు ఎక్కడ అమలవుతాయని అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీఆర్ గార్డెన్లో భాజపాకు చెందిన పలువురు కార్యకర్తలు తెరాసలో చేరగా.. ఈ కార్యక్రమానికి మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి హాజరయ్యారు. కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ భాజపా అనే పాతబొందలో పడ్డారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. దాని నుంచి బయటకు రావాలనే గడియారాలు, కుట్టు మిషన్లు, చరవాణీలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాజపాకు కనీసం డిపాజిట్ కూడా దక్కదని వ్యాఖ్యానించారు.
భాజపా ప్రభుత్వం ఏ వర్గానికి ఏం చేసిందని ఈ సందర్భంగా మంత్రి ప్రశ్నించారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచినందుకు భాజపాకు ఓటేయాలా అని నిలదీశారు. నల్ల చట్టాలు తెచ్చి కార్మికులు, రైతులను ఇబ్బందిపెట్టే ఆ పార్టీకి ఏ ఒక్కరూ ఓటేయరని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులంతా తెరాసవైపే ఉన్నారని స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ సమావేశాలను ఏర్పాటు చేసుకొని తెరాసకు మద్దతు ఇస్తామంటూ తీర్మాణాలు చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. తాము అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని నమ్ముకున్నామని.. అందుకే ప్రజలంతా మావైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ.. భాజపా ప్రభుత్వం రిజర్వేషన్లు లేకుండా చేస్తోంది. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. కార్మిక చట్టాలను సవరించి.. ఇతర రాష్ట్రాల్లో వారికి పని వేళలను పెంచింది. అలాంటి భాజపాకు కార్మికులెవరైనా ఓటు వేస్తారా? అసలు హుజూరాబాద్ నియోజకవర్గంలో భాజపాకు ఓటు వేసే వారు ఎవరైనా ఉన్నారా..? డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిన భాజపాకు డిపాజిట్ కూడా దక్కదు. ప్రజలంతా మా వైపే ఉన్నారు.-హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి
ఇవీ చూడండి..
HARISH RAO: 'భాజపా హయాంలో దేశం బంగ్లాదేశ్‌తో కూడా పోటీపడలేకపోతోంది'
HARISH RAO: 'హుజూరాబాద్‌లో తెరాస గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరు'