ఏడేళ్ల పాటు మంత్రిగా ఉన్న ఈటల.. హుజూరాబాద్(HUZURABAD) నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టించలేదని మంత్రి హరీశ్ రావు(HARISH RAO) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయం అడిగినందుకు తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా నియోజకవర్గంలోని స్వశక్తి మహిళా సంఘాల గ్రూపులకు మంత్రి.. రూ.కోటి 25 లక్షల 60 వేల విలువ చేసే చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల, కేంద్రంపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఈటల రాజేందర్.. తెరాసకు రాజీనామా చేసి భాజపాలోకి వెళ్లారు కదా.. అలా వెళితే ఎవరికి లాభమని ప్రజలను హరీశ్ అడిగారు. తెరాస పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఓటేస్తారని అడిగారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడానికి భాజపానే కారణమని హరీశ్ ఆరోపించారు.
సెంటిమెంట్ డైలాగులు కాదు.. పనిచేసే వాళ్లను గెలిపించాలి. ఏడేళ్ల పాటు మంత్రిగా ఉండి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదు. నియోజకవర్గంలో పేదలకు ఇళ్లు కట్టించలేదని అడగటం తప్పా.? గ్రైండర్లు, కుంకుమ భరిణిలు ఇచ్చి ప్రజలను మభ్య పెడుతున్నారు. ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. ఆడపడుచుల కోసం కల్యాణ లక్ష్మి ఇస్తున్నాం. గర్భిణీలకు కిట్లు అందిస్తున్నాం.
-హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి
సొంత స్థలాలు ఉంటే ఇళ్లు కట్టిస్తాం
దేశంలో భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కల్యాణలక్ష్మి లాంటి పథకాలను అమలు చేయటం లేదని మంత్రి హరీశ్ అన్నారు. నియోజకవర్గంలో ఒక్కటి కూడా రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవటం దురదృష్టకరమని.. ఇది ఎవరి నిర్లక్ష్యమో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. తెరాస పేద ప్రజల ప్రభుత్వమని.. పేదల కోసమే పని చేస్తుందని హరీశ్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి నిరుపేదలకు అప్పగించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. సొంత స్ధలాలు ఉన్న వారికి డబ్బులిచ్చి ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడుతామని చెప్పారు. సైదాపూర్-బోర్నపల్లి రోడ్డుకు రూ.6కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
కేంద్రంలో ఉన్న భాజపా.. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను పెంచుతూ రాయితీలను తగ్గించిందని మండిపడ్డారు. భాజపా అభ్యర్థి ఈటల.. బొట్టుబిల్లలు, కుక్కర్లు, కుట్టుమిషన్లను పంపిణీ చేస్తూ ఓట్లడుగుతున్నారని ఎద్దేవా చేశారు. బొట్టుబిల్లలు కావాలా ఆసరా పింఛన్ కావాలా అని మహిళలను మంత్రి అడిగారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
ఇదీ చదవండి: KTR on Trolls: సోషల్‌మీడియా ట్రోల్స్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్..