ఒక్క ఏడాదిలోనే రూ. 40 రూపాయలు డీజిల్ ధరలు పెంచి.. ఉన్న ఉద్యోగులను ఊడగొడుతున్న పార్టీ భాజపా అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao Comments) ఎద్దేవా చేశారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో ఆరె కులస్థుల ఆశీర్వాద సభకు ముఖ్యఅతిథిగా హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ పాల్గొన్నారు.
వ్యవసాయం చేసుకుని జీవించే వారు ఆరే కులస్థులని హరీశ్‌రావు అన్నారు. కేంద్రంలోని భాజపా వ్యవసాయ బావులకు మీటర్లు పెడుతోందన్నారు. రాత్రిపగలు కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సంవత్సరం రైతులందరికీ నీరందిస్తున్నామని తెలిపారు. రూ. 5,700 కోట్లతో రైతుబంధు అందించామని... వారం రోజుల తరువాత వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.
వచ్చే ఉగాది పండుగ లోపల రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టని వ్యక్తి ఈటల రాజేందర్ అని విమర్శించారు. హుజూరాబాద్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే 5,500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామన్నారు. నాలుగు నెలల క్రితం రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేయాలన్న ఈటల... ఇప్పుడు యూటర్న్ తీసుకొని భాజపాలో చేరారని విమర్శించారు.
ఛాయ్ తాగుతూ సందడి...
హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. గ్రామాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమౌతున్నారు. పలు కార్యక్రమాలకు వెళ్లి తిరిగి వస్తూ ఛాయ్ తాగుదామని హుజూరాబాద్‌లోని సిటీ ప్యాలెస్‌లోకి వెళ్లారు. గిరాకీ ఎలా అవుతోంది? ఎన్నికల వేళ బాగుందా అని ప్యాలెస్ యాజమానితో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. బాగుంది సర్.. అంటూ నవ్వుతూ యజమాని సమాధానం ఇచ్చాడు. మీ దగ్గర ఛాయ్ బాగుంటుందట అందుకే ఆగాను. ఆప్కే పాస్ ఛాయ్ బహుత్ అచ్చా హై " అంటూ వారి మనసు (Harish Rao Tea) దోచుకున్నారు. సార్ ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న.. మీరూ మా హోటల్లో ఛాయ్ తాగుతే బాగుండని... ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సార్! మీతో ఒక సెల్ఫీ దిగాలి అని అన్నాడు హోటల్ యజమాని. ఇద్దరూ సరదాగా సెల్ఫీ దిగారు. ప్యాలెస్ ప్రాంతం అంతా సెల్ఫీలతో సందడిగా మారింది. మరో సారి వస్తా అంటూ ఛాయ్ డబ్బులు చెల్లించి మంత్రి హరీశ్‌రావు వెళ్లిపోయారు.
ఇదీ చూడండి: CM KCR: అఖిలపక్షంగా దిల్లీ వెళ్దాం.. 'పోడు'పై ప్రధానిని కలుద్దాం...