ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినంత మాత్రాన మొక్కలు పెంచడం జరిగిపోదని... అమలు చేసే అధికారుల్లో పట్టుదల, ఆసక్తి ఉంటేనే సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పోలీస్ శిక్షణ కేంద్రంలో రెండో మియావాకి ప్రాజెక్టును మేయర్ సునీల్‌రావు, సీపీ కమలాసన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఇప్పటికే ఒక మియావాకి ప్రాజెక్టులో మొక్కలు నాటే ప్రక్రియ విజయవంతం అయ్యిందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు మేయర్ సునీల్‌రావు, కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి మొక్కలు నాటారు.
"ఒక ఎకరం 14గుంటల్లో దాదాపు 15వేల మొక్కలు నాటడమే కాకుండా... వాటిని సంరక్షిస్తూ సీపీ కమలాసన్‌రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. ఒకవైపు శాంతిభద్రతలను సంరక్షిస్తూనే మరోవైపు చెట్ల పెంపకానికి సీపీ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. పచ్చని వనాన్ని కరీంనగర్ ప్రజలకు ఒక ఆస్తిగా అందించారు."
-గంగుల కమలాకర్, బీసీ సంక్షేమశాఖమంత్రి