నియోజకవర్గంపై ప్రేమ ఉంటేనే అభివృద్ధి చేస్తారని, సొంత ఆస్తులపై ప్రేమను పెంచుకుంటే నియోజకవర్గాన్ని గాలికి వదిలేస్తారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రణీత దిలీప్‌తో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేస్తారని, దానికి నిదర్శనమే కరీంనగర్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం కేసీఆర్ అత్యధిక నిధులు కేటాయించడం వల్లే కరీంనగర్ రూపురేఖలు మారిపోయాయన్నారు. అభివృద్ధిలో కరీంనగర్ దూసుకుపోతోందన్నారు. తెలంగాణపై ఆయనకున్న నిబద్ధతే ఈ అభివృద్ధికి కారణమన్నారు.
ఈటల రాజేందర్ గత ఏడేళ్లుగా ఆర్థిక శాఖ, వైద్యారోగ్య శాఖ వంటి కీలక శాఖల మంత్రిగా ఉండి కూడా హుజూరాబాద్ నియోజకవర్గానికి, జమ్మికుంటకు ఎందుకు నిధులు అడగలేదని ప్రశ్నించారు, ఆయనకు కేవలం తన సొంత ప్రయోజనాలే ముఖ్యమని, నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ది లేదని గంగుల ఎద్దేవా చేశారు. ఓట్లేసిన ప్రజల రుణం తీర్చే కనీస ప్రయత్నం చేయలేదని ఆయన విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే తపన లేనే లేదని దుయ్యబట్టారు. అందువల్లే హుజూరాబాద్‌తో పాటు జమ్మికుంటను చూస్తే అభివృద్ధి లేమితో అస్తవ్యస్థంగా ఉందని గంగుల అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి జమ్మికుంట అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వెంటనే 31కోట్ల రూపాయల నిధుల్ని ఒకే విడతలో జమ్మికుంటకు మంజూరు చేయించడమే కాకుండా... జులై 12 నుంచి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని మంత్రి గంగుల వెల్లడించారు.
తెరాసదే విజయం
ఇన్ని రోజులు స్థానిక ఎమ్మెల్యే తన సొంత పనుల కోసం మాత్రమే సీఎం కేసీఆర్‌ను కలిశారు. హుజూరాబాద్ అభివృద్ధి గురించి సీఎం ఎప్పుడు ప్రశ్నించినా.. ఏనాడు సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లలేదు. అలాంటి వ్యక్తి మళ్లీ ఉపఎన్నికల్లో నిలబడుతున్నాడు. ఇన్నాళ్లు మంత్రిగా అధికారంలో ఉండి కూడా అభివృద్ధి చేయని ఆయన.. రేపు ఎలా అభివృద్ధి చేస్తారు. తాజా మాజీ ఎమ్మెల్యేకు గెలిచే అవకాశం లేదని స్పష్టంగా తెలుసని.. అందుకే మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నియోజకవర్గ ప్రజలు నిలుస్తారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని, జమ్మికుంట మున్సిపాలిటీని సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్‌లకు దీటుగా తీర్చిదిద్దుతాం. -గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
ఇదీ చదవండి: Bonalu: తెలంగాణ సంస్కృతి అద్దంపట్టేలా బోనాల నిర్వహణ