కరోనా కేసుల కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు పని చేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల పర్యటించారు. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి, రంగాపూర్‌లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఈటలతోపాటు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయలు కలిసి ప్రారంభించారు. ధాన్యం తూకం వేసి, ధాన్యం నిల్వలను ఆయన పరిశీలించారు.
బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా
హుజూరాబాద్ మండలం కందుగులలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని మంత్రి మొదలుపెట్టారు. ఆక్సిజన్, రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ విభాగానికి డివిజన్ల వారీగా కమిటీలు వేసుకుని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. రెమ్ డిస్‌విర్ ఇంజక్షన్ల కొరత లేకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే 3 నుంచి 4 లక్షల డోసుల నిల్వలు అందుబాటులో ఉంచామన్నారు. ప్రభుత్వ పరమైన ఆసుపత్రుల్లో ఎక్కడా కూడా రెమ్ డిస్‌విర్ ఇంజక్షన్ల కొరత లేదని అన్నారు.
7 నుంచి 8 రోజుల సమయం
ఆక్సిజన్ అనేది ఒక రాష్ట్రం చేసుకునేది కాదని ఈటల అన్నారు. ఎక్కడైతే ఉక్కు కర్మాగారాలు ఉన్నాయో అక్కడి నుంచి రావల్సి ఉంటుందన్నారు. కేంద్రం తెలంగాణకు ఆక్సిజన్ కేటాయింపు అనేది చేసింది కానీ... సుదూర ప్రాంతాల నుంచి కేటాయించిందన్నారు. ఇక్కడికి ఒక ఆక్సిజన్ ట్యాంకర్ రావాలంటే 7 నుంచి 8 రోజుల సమయం పడుతుందన్నారు. విశాఖ, బళ్లారీ ప్రాంతాల్లో ఉన్న ఉక్కు కర్మాగారాల నుంచి ఆక్సిజన్ కేటాయించాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరామని... సకాలంలో స్పందిస్తారా లేదా అని తెలియాల్సి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
అవసరం ఉంటేనే ఆక్సిజన్
కేవలం తెలంగాణ నుంచి కాకుండా మహరాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలకు చెందిన రోగులు హైదరాబాద్‌కు చికిత్సల కోసం వచ్చే అవకాశం ఉందన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని వెల్లడించారు. ఆక్సిజన్ సరఫరాపై నిరంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తాను కలిసి దృష్టిపెట్టామన్నారు. ఇప్పటివరకైతే ఆక్సీజన్ కొరత లేకుండా చూస్తున్నామన్నారు. అవసరం ఉంటేనే రోగులకు ఆక్సిజన్ అందించాలని వైద్యులకు, ఆసుపత్రి యాజమాన్యాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ అందించే రోగులకు వైద్యులు, సిబ్బంది నిరంతరంగా పర్యవేక్షించాలన్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
మే 1 నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారికి కరోనా టీకాను అందించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి పెద్దగా లేదన్నారు. ఎక్కడికక్కడ గ్రామీణులు స్వీయ నియంత్రణ పాటించి కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పట్టణాల్లో వైద్యారోగ్యశాఖ మున్సిపల్‌తోపాటు ఇతర శాఖలతో మమేకమై కరోనా నివారణ చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇదీ చూడండి: భద్రాద్రిలో పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి