రైతులకు అన్యాయం జరగకుండా ఉండేందుకే గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో రైతు వేదికలను ఆదివారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలతో కొనుగోలు కేంద్రాలను మూసివేస్తామని మొదట ప్రకటన రావడంతో రైతులంతా నైరాశ్యానికి గురయ్యారని.. ప్రస్తుతం కేంద్రాలు ఉంటాయని సీఎం ప్రకటించటంతో రైతులంతా సంతోషంగా ఉన్నారని మంత్రి అన్నారు.
ప్రజలు గుర్తిస్తేనే మనం ఇక్కడ ఉన్నామని రాజకీయ నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు. నాయకులంటే భారీ ఆకారంతో మెడకు గొలుసు, చేతులకు ఉంగరాలు, బ్రాస్‌లెట్‌లు కాదు.. కులం, మతం, పార్టీలు, జెండాలతో పని ఉండదు.. ప్రజల కన్నీళ్లు చూసి స్పందించే వాడే నిజమైన మనిషి అని ఈటల తెలిపారు.
'ముంజేతి కంకణానికి అద్దం ఎలా అవసరం లేదో అలాగే నేను చేసిన పనులు చెప్పుకునే అక్కరలేదు అనుకుంటున్నా. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. కానీ అంతిమ విజయం వాటిదే. మీ కుటుంబంలో రక్తం పంచుకు పుట్టకపోవచ్చు కానీ మిమ్మల్ని ఆదుకుంటా. మా అన్న ఉన్నాడు అనే భరోసాతో ఉండండి.'
-ఈటల రాజేందర్, మంత్రి
సమావేశంలో జిల్లా పరిషత్ ఛైర్మపర్సన్ విజయ, ఎంపీపీ రేణుక, జడ్పీటీసీ సభ్యురాలు మాడ వనమాల పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది?