పాఠశాలల్లోని విద్యార్థులకు విషయ బోధన కంటే దృశ్య రూపంలో వివిధ రకాల ప్రయోగాలు, ఆవిష్కరణలు వారి మెదళ్లలో నిక్షిప్తం చేసేలా నిలిచే కరీంనగర్‌లోని జిల్లా సైన్స్ మ్యూజియంపై మూడు నాలుగేళ్లుగా నిర్లిప్తత అలుముకుంది. ప్రయోగ పరికరాల నిర్వహణకు నిధుల లేమి, సిబ్బంది కొరతతో కొంతకాలంగా నిరాదరణకు గురవుతోంది. విద్యాశాఖ ప్రేక్షకపాత్ర పోషిస్తుండగా.. పాలకులు, జిల్లా అధికార యంత్రాంగం దీన్ని ఏనాడో మర్చినట్లున్నారు. ఉమ్మడి జిల్లాలోనే కాదు సమీప జిల్లాలోని విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ మ్యూజియాన్ని సందర్శనకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నది విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆకాంక్షగా మారుతోంది.
ఆసక్తి పెంపే లక్ష్యంగా..
2005లో రాష్ట్ర విద్యాశాఖ రూ.20 లక్షల వ్యయంతో కరీంనగర్‌లోని ప్రభుత్వ పురాత ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేసింది. ఆ రోజుల్లో హైదరాబాద్ తర్వాత ఇక్కడే ఆలోచింపజేసే శాస్త్ర, విజ్ఞాన ప్రయోగాలు, ఆవిష్కరణలతో దీన్ని తీర్చిదిద్దారు. భౌతిక, రసాయన, జీవశాస్త్రం, గణితంతో పాటు వీటి అనుసంధానంతో ఆలోచింపజేసే ఆసక్తికరమైన 60కి పైగా ప్రయోగాల వర్కింగ్ మోడల్స్‌ను ఇందులో ప్రదర్శనగా ఉంచారు.
మాదిరి నక్షత్రశాల, చేతివేళ్లు సవ్వడిగా ఆడిస్తే వచ్చే సరిగమలు, మేధస్సుకు పదునుపెట్టే బ్రహ్మస్థూపం, వింతగొలిపే మొండెం లేని తల, కోణాలు తగ్గిన కొలది అద్దాల్లో పెరిగే ప్రతిబింబాలు, దిశ మారిన కొలది బంతి వేగం పెరిగే స్విన్‌ఫన్, గాలిలో తేలియాడే బంతి, అరుదుగా కనిపించే శ్వేతనాగు, జంతు, వృక్ష అవశేషాలు వంటివెన్నో ఈ మ్యూజియంలో నెలకొల్పారు.
కొరవడిన నిర్వహణ
ప్రేరణ మనాక్ అవార్డులు, జాతీయ అన్వేషిక, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ వంటి కార్యక్రమాల్లో జిల్లా విద్యార్థుల ఆవిష్కరణలు ఆకట్టుకుని జాతీయ స్థాయికి వెళ్తున్నాయి. సైన్స్‌పై బాలల్లో ఆసక్తి పెరిగినా స్వతహాగా పలు ప్రయోగాలు చూసి వాటి పనితీరును ప్రత్యక్షంగా గ్రహించే వీలు గల ఈ మ్యూజియం దుస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా దీని నిర్వహణకు నిధులను కేటాయించి ప్రయోగాల పని తీరును పునరుద్ధరించాలని పాలకులు, జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు. నిర్వహణకు నిధులు, సిబ్బందిని కేటాయిస్తే మ్యూజియం ఉపయోగంలోకి వచ్చి విద్యార్థుల్లో సైన్స్ పరిజ్ఞానం పెంచేందుకు దోహదపడుతుందని జిల్లా సైన్స్ అధికారి ఎం.స్వదేశ్‌కుమార్ పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : ఈ నెల 18, 19న శాసనసభ ప్రత్యేక సమావేశాలు