ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న కరీంనగర్‌లో రోడ్ల నిర్మాణంలో సరికొత్త రూపును సంతరించుకుంటోంది. గతంలో రోడ్లంటే సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు మాత్రమే కనిపించేవి. కానీ స్మార్ట్‌సిటీలో భాగంగా చేపడుతున్న రహదారి పనులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. తొలి విడతలో ఆయా పనులకు 198 కోట్ల రూపాయలు మంజూరు కాగా.. పనులు శరవేగంగా చేపడుతున్నారు. తొలత నగరంలోని 8 రహదారులను ఎంపిక చేసుకుని ప్రయోగాత్మకంగా టైల్స్ వేస్తున్నారు. పగలు ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల ఇటీవల రద్దీ పెరిగింది. రాత్రి వేళల్లో రహదారుల నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ రోడ్లపై వాహనాలు, సైకిళ్లు, కాలినడకన వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నట్లు మేయర్ సునీల్‌రావు తెలిపారు. ప్రయోగాత్మకంగా కలెక్టరేట్ దారిలో టైల్స్ వేస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం మాత్రం..
లాక్‌డౌన్ కారణంగా కొంతమేరకు పనులు ఆలస్యమైనప్పటికి ప్రస్తుతం మాత్రం ఆయా పనులను వేగవంతం చేశారు. కొంతమేర కూలీల కొరత ఉన్నప్పటికి అత్యవసర పనుల తరహాలోనే ఈ పనులు చేపడుతున్నారు. కొత్తగా వేసే రోడ్లు చెడిపోకుండా మన్నికగా ఉండే విధంగా.. చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదం కలిగించడమే ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం స్మార్ట్‌సిటీ పనులు ప్రారంభమై.. ఇప్పుడు ఊపందుకున్న తరుణంలో కరోనా కారణంగా తాత్సారం జరిగిందని అధికారుల అంగీకరిస్తున్నారు. ఇప్పుడు వేగంగా పనులు జరుగుతున్నా.. నాణ్యతలో రాజీలేకుండా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ వివరించారు.
తొలి విడత పనులు పూర్తైన తర్వాత రెండో విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉండటం వల్ల పనులు మరింత వేగంగా పుంజుకున్నాయి.
ఇదీ చూడండి : పుట్టి ఆరు రోజులైంది.. అంతలోనే కరోనా సోకింది!