గతంలో ఎన్నడు లేనివిధంగా ఈ వానాకాలంలో కరీంనగర్ జిల్లాలో 25వేల ఎకరాలకుపైగా వరి, పత్తి పంటలు నీట మునగడంతో రైతు కంట కన్నీరే కనిపిస్తోంది. మూడేళ్లుగా చేతికందే సాయం కోసం ఎదురుచూస్తున్నా.. పైసా చేతికందని తీరు మాత్రం రైతన్నను ప్రతి ఏటా నిరాశపరుస్తోంది.
బీమా.. ధీమా లేక దిగాలు..
ఈ సారి ప్రధాన పంటల్లో పత్తి పంటకు మినహాయించి ఇతర పంటలకు ఎలాంటి బీమా లేకపోవడంతో రైతులకు మరింత నష్టం వాటిల్లుతోంది. పసల్‌బీమా సహా ఇతర బీమాలు వరికి అమలవకపోవడం, ఈసారి ఈ పంటనే వేలాది ఎకరాల్లో దెబ్బతినడంతో రైతులు కుంగిపోతున్నారు. గతంలో కొంతలో కొంతైనా వరి పంటకు బీమా వర్తించేది. అన్నదాతలు తీసుకుంటున్న రుణాల్లోనుంచి ప్రీమియం చెల్లింపులు జరిగేవి. కొంచెం ఆలస్యంగానైనా ఇలాంటి సమయంలో వారికి సర్కారు సాయం బీమా రూపంలో అందేది.
ఈ సారి వానాకాలం పంటలకు ఆ అవకాశం లేకపోవడంతో హలదారికి అవస్థలు తప్పడం లేదు. మరోవైపు 33శాతానికన్న ఎక్కువగా దెబ్బతిన్న పంటలకే పరిహారాన్ని అందించే అవకాశాలుంటాయి. కానీ జిల్లాలో సుమారుగా 18వేల ఎకరాల్లోని పంటలకు 33శాతం కన్నా తక్కువగా నష్టం వాటిల్లింది. మరోవైపు క్షేత్రస్థాయిలో పరిశీలనల్ని, పర్యటనల్ని చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం సర్కారు సాయం అందిస్తుందన్న తరహాలో భరోసాను కల్పిస్తున్నారు.
మూడేళ్లుగా సాయం కరవు..!
జిల్లాలో ప్రతి ఏడాది సగటున రెండు సీజన్లలో 10శాతానికిపైగా పంటనష్టం వాటిల్లుతోంది. ఇలా గడిచిన మూడేళ్లుగా ఎదురవుతున్న అవస్థలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం నుంచి మాత్రం పరిహారం రూపంలో ఎలాంటి సాయం అందడం లేదు. ఒక్క ఈ ఏడాదిలోనే రైతులకు ఎంతలేదన్నా అ వానల వల్ల ఈ సారి రూ.26కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇలా ప్రతి యేడాది ఇదే విధంగా కష్టం కలుగుతుండగా.. ఇప్పటి వరకు మూడేళ్లుగా సుమారుగా రూ.90 కోట్ల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ సారి కూడా జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురియడంతో రికార్డుస్థాయిలో 2,47149 ఎకరాల్లో వరి పంట వేయగా 73,028 ఎకరాల్లో పత్తిపంట వేశారు. 25,104 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అంటే వేసిన పంటలో సుమారుగా 8శాతం నష్టాల పాలయ్యింది. ప్రతి ఏడాది నష్టం జరుగగానే అంచనాలు వేయడం, ప్రతిపాదనలు పంపడంతోనే సరిపెడుతుండటంతో రైతుల్లోనూ వీటి దిశగా ఆశలు సన్నగిల్లుతున్నాయి.
ఇదీ.. శంకరపట్నం తాడికల్ సమీపంలోని ఓ రైతు పొలం దుస్థితి. వేసిన ఎకరానికిపైగా పంట ఇటీవల వర్షాలకు నీట మునిగింది. ఉన్నపళంగా పొలంలో నీళ్లు నిలిచిన తీరుని చూసి రైతు కంట కన్నీరు కనిపించింది. తీరా వేసిన నాటంతా కొట్టుకుపోవడానికి తోడుగా గుంట గుంటలో నిల్వగా పేరుకున్న ఇసుక మేటలతో కొత్త చిక్కు వచ్చి పడింది. మరో 10-20వేల రూపాయలు వెచ్చిస్తేకాని ఇది పొలంనుంచి బయటకు ఎత్తిపోయడం సాధ్యం కాదు. ఇలా జిల్లాలోని 4వేలకుపైగా ఎకరాల్లో అన్నదాతలను వర్షం నిలువునా ముంచింది.
గత నెల 16వ తేదీన జిల్లాలో వరసగా కురిసిన వానలతో జరిగిన నష్టాన్ని జిల్లాధికారులు అంచనా వేశారు. ఏకంగా 13 మండలాల పరిధిలో 24,803 ఎకరాల్లో ఆయా పంటలు నీటమునిగినట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. గ్రామాల వారీగా రైతుల వివరాల్ని సేకరించి 4,404 మందికి నష్టం జరిగినట్లు పరిహారం ఇవ్వాలనేలా ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఇందులో ఇక 33 శాతం కన్నా ఎక్కువగా 7,276 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అధికారులు లెక్కలు కట్టారు. ఇక ఈనెల 15, 16వ తేదీల్లో కురిసిన వర్షాలకు కూడా జిల్లా వ్యాప్తంగా మరో 231 ఎకరాల్లో వరి, పత్తి పంటలకు ఊహించని విధంగా నష్టం జరగడంతో రైతుల్లో ఆవేదన పెరుగుతోంది.