కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నష్టంపై సంబంధిత శాఖ అధికారులతో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమీక్షించారు. నష్టాలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఈ మేరకు తహసీల్దారులు, ఎంపీడీవోలు, పంచాయతీ రాజ్, మైనర్ ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన పరిణామాలపై చర్చించారు.
గ్రామాల్లో కూలిన ఇళ్లు, పాడైపోయిన రోడ్లు, కల్వర్టులు, చెరువులు, కుంటలు, కట్టలు, పంట నష్టంపై తాత్కాలిక, శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో రైతు వేదికలు, రైతు మార్కెట్లు, పల్లె ప్రకృతి వనాల పనులతో పాటు ఉపాధి హామీ కింద చేపట్టిన పనులు పూర్తి చేయాలని కోరారు. అధికారులు, గ్రామాల్లోని ప్రజాప్రతినిధుల పరిధిలో సమస్యలు పరిష్కారం కాకుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.