కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కోసం పంపిన ప్రతిపాదనలు వందల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో ప్రతిపాదించబడిన వారి లైసెన్సులు రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు లైసెన్సులు రద్దు కాబడిన వారికి సమాచారం అందించి.. వారి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సులను స్వాధీనం చేసుకుంటామని ఆయన తెలిపారు.
లైసెన్సులు రద్దు కాబడిన వారి సంఖ్య ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు 102కు చేరుకుందని సీపీ అన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని కమిషనర్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపాదనలు పంపిన వాటిలో 95 శాతానికి పైగా సదరు వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తూ రవాణా శాఖ అధికారులు ఉత్తర్వులను జారీ చేస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం సేవలందిస్తున్న రవాణాశాఖ అధికారులకు పోలీస్ కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు
ఈ-చలాన్, స్పీడ్ గన్స్ ద్వారా జరిమానాలు
నియమ నిబంధనలు విస్మరించి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారికి ఈ- చలాన్ ద్వారా జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు 6 లక్షల 2వేల 836 మంది వాహనదారులకు జరిమానాలు విధించారని సీపీ తెలిపారు. ఈ- చలాన్ల ద్వారా మూడు కోట్ల 88 లక్షల 42 వేల 515 రూపాయల విలువ గల జరిమానాలు విధించబడ్డాయని సీపీ తెలిపారు.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని జాతీయ, రాష్ట్ర రహదారులు, ఇతర రహదారులపై పరిమితికి మించిన వేగంతో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులకు స్పీడ్‌గన్ ద్వారా జరిమానాలు విధిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. వివిధ రకాల రహదారులపై ఎంత వేగంతో వాహనాలు నడపాలని సూచిస్తూ సైన్ బోర్డులను ఏర్పాటు చేశామని.. అయినా నిర్లక్ష్యంతో వాహనదారులు అతివేగంతో వాహనాలు నడుపుతున్నారన్నారు.
ఈ సంవత్సరం ఇప్పటివరకు 1,94,746 వాహనాలకు స్పీడ్‌గన్స్ ద్వారా జరిమానాలు విధించడం జరగిందని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు ప్రజల సహకారం లభించడం ఆహ్వానించదగిన పరిణామమని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పచ్చదనమే పచ్చ'ధనమే'.. పార్కుల అభివృద్ధిపై దృష్టి