కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డును కలెక్టర్ శశాంకతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి గంగుల అన్నారు. ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని మంత్రి సూచించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రికి వచ్చిన రోగికి పది నిమిషాల్లో చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. ఎంత మందికి ఆక్సిజన్ అవసరం ఉందో, ఊపిరితిత్తుల సమస్య ఉందో గుర్తించాలన్నారు.
125 ఆక్సిజన్ బెడ్లు, 180 పడకలు...
ప్రభుత్వాసుపత్రిలో సరిపడా ఇంజెక్షన్లు, టాబ్లెట్లు అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ ఆస్పపత్రిలో 125 ఆక్సిజన్ బెడ్లు, 180 పడకలు కొవిడ్ బాధితుల కోసం సిద్ధంగా ఉన్నాయన్నారు. పారిశుద్ధ్య సిబ్బందిలో 137 మందికి గాను 85 మంది హాజరుకావడం పట్ల మంత్రి అజైల్ గ్రూపు కాంట్రాక్టర్ రాజిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోగులకు మనోధైర్యం కల్పించాలి...
ప్రభుత్వాసుపత్రిని ప్రజలు నమ్మే విధంగా మార్చాలని వైద్యులకు స్పష్టం చేశారు. వైద్యులు, అధికారులు సమన్వయంతో పని చేసి రోగులకు మనోధైర్యం కల్పించాలని మంత్రి కోరారు. కొవిడ్ పేషెంట్ల కోసం అన్ని సౌకర్యాలు కల్పించామని, మందులు అందుబాటులో ఉంచామని వివరించారు. ఆస్పత్రిలో పలువురు అధికారులతో కలిసి కవిడ్ శాంపిల్ కలెక్షన్ సెంటర్, కొవిడ్ ప్రత్యేక వార్డులను పరిశీలించారు.
చర్యలపై ఆరా...
కరోనా బాధితుల కోసం ఆసుపత్రిలో చేపట్టిన చర్యలపై మంత్రి ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. వైరస్ మరణాల రేటును తగ్గించేలా అందరూ కృషి చేయాలన్నారు. వైద్యుల కొరత లేకుండా ప్రత్యేకంగా ఐదుగురు వైద్యులను నియమించామని, 20 మంది స్టాఫ్ నర్సులను శనివారం నియమిస్తామన్నారు. మరో 16 మంది హెడ్ నర్సులను నాలుగైదు రోజుల్లో నియామక పత్రాలు అందిస్తామని హామీ ఇచ్చారు.