Students Complained To Collector in Jogulamba Gadwal : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లిలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ వేధిస్తున్నారని, పాఠాలు సరిగా చెప్పడం లేదని ఆయనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కలెక్టర్ సంతోష్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం కళాశాల గోడ దూకి కాలినడకన బీచుపల్లి నుంచి గద్వాలలోని కలెక్టరేట్‌కి 18 కి.మీ. పాదయాత్ర చేసుకుంటూ వచ్చి కలెక్టర్‌కు తమ సమస్యలను తెలిపారు.
క్రమశిక్షణ పేరుతో వేధిస్తున్నారు : అనంతరం విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ ప్రిన్సిపల్ నిత్యం క్రమశిక్షణ పేరుతో వేధిస్తూ కొడుతున్నారని ఆరోపించారు. స్టడీ మెటీరియల్ కూడా ఇంకా ఇవ్వలేదని, విద్యాబోధన సరిగా చెప్పట్లేదని వాపోయారు. గురుకులంలో మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో బహిర్భూమికి చెట్లు, గుట్టల్లోకి పోతున్నామని తెలిపారు. మెనూ ప్రకారం భోజనంపెట్టడం లేదని ఆరోపించారు. వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికే పాదయాత్ర చేసుకుంటూ వచ్చామని తెలిపారు. 6వ తరగతిలో సీట్లు మిగిలితే అమ్ముకున్నారని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వివరించారు.
సమస్యల గురించి తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే : విద్యార్థులను గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి వీరాపురం స్టేజీ వద్ద కలిసి, సమస్యలు తెలుసుకుని కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మధ్యలో ఇటిక్యాల పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆపి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయినా వాళ్లకు ఎలాంటివి వివరాలు చెప్పకుండా కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీ కొనసాగించారు. సుమారు 200 మంది ర్యాలీగా వెళ్తుండటంతో పోలీసులు వారికి బందోబస్తుగా వెళ్లారు.
విద్యార్థులను ఇబ్బందులు పెట్టలేదు : దీనిపై ప్రిన్సిపల్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా విద్యార్థులు ఉపాధ్యాయుల అనుమతి లేకుండా బయటకు వెళ్లి చెడు అలవాట్లు చేసుకుంటుండటంతో హెచ్చరించానన్నారు. అందులో భాగంగా ఓ విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించామన్నారు. దీంతో విద్యార్థులు తనపై ఆరోపణలు చేస్తున్నారని తాను ఎవరినీ కొట్టట్లేదని వివరించారు. విద్యాబోధన సరిగా చెప్పట్లేదన్నది అవాస్తమని చెప్పుకొచ్చారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తానని తెలిపారు. తాను విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నానని చెప్పడంలో వాస్తవం లేదన్నారు.
'నో డిటెన్షన్' విధానం రద్దు- ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్‌గా పాస్ కావాల్సిందే!
'గంజాయి, డ్రగ్స్ జోలికి వెళ్లకండి, అవి కనిపిస్తే 100కు కాల్ చేయండి' - స్టూడెంట్స్‌కు సీఎం అడ్వైజ్