రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. హుజురాబాద్ ఎన్నిక నేపథ్యంలో నేతలు ప్రచారాలపై తీవ్రంగా దృష్టిసారిస్తున్నారు. గతంలోనూ నాగార్జున సాగర్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ ప్రాంతంలో కరోనా కేసులు భారీగా వెలుగు చూశాయి. అధికారులు వైరస్ కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మరో మారు హుజురాబాద్ ఎన్నికల జోరు చూస్తుంటే తదుపరి హాట్ స్పాట్(Corona Hotspot)గా హుజురాబాద్ మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రిపీట్ అవనుందా..
నాగార్జునసాగర్ ఉపఎన్నికల తర్వాత.. ఆ నియోజకవర్గం కరోనా హాట్‌స్పాట్(Corona Hotspot)గా మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలంతా వైరస్ బారిన పడ్డారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మహమ్మారి కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పరిస్థితులు త్వరలోనే మెరుగయ్యాయి. ఇలాంటి పరిస్థితే రాష్ట్రంలో పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ప్రచార వేడి షురూ..
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష భాజపా, కాంగ్రెస్‌లు ఎవరికి వారే ఈ నియోజకవర్గంలో జెండా పాతేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఈ పార్టీలన్ని ప్రచారం మొదలుపెట్టాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు, రోడ్‌షోలు, పాదయాత్రలు ప్రారంభించాయి.
కరోనా వ్యాప్తి తప్పదా..
ఈ ఎన్నికల ప్రచారంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉండనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న కొవిడ్.. ఈ ఎన్నికల వల్ల మరోసారి ఉద్ధృతమవుతుందని అభిప్రాయపడుతోంది.
మరో హాట్‌స్పాట్‌గా హుజూరాబాద్..
రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నా.. ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, వరంగల్ అర్బన్, రూరల్, మంచిర్యాల జిల్లాల్లో మాత్రం వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. మహమ్మారి కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉప ఎన్నిక ప్రచారాలతో హుజూరాబాద్ కరోనాకు మరో హాట్ స్పాట్(Corona Hotspot)గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జాగ్రత్తలు తప్పనిసరి..
హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక కార్యకర్తలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. నవంబర్‌లో రావాల్సిన మూడో ముప్పు ఇప్పుడే విజృంభిస్తుంది. ప్రచారంలో గుంపులు గుంపులుగా ఉండకుండా.. కరోనా నిబంధనలు పాటించాలి. మాస్కు ధరించాలి.
అప్రమత్తతే ఆయుధం..
మారుతున్న రాజకీయ పరిస్థితులు, పలువురు నేతలు ప్రచార సమయాల్లో మాస్కులు ధరించకపోవటం వంటి వాటిని డీహెచ్ శ్రీనివాస్ తప్పుబట్టారు. ప్రజల ప్రాణాల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. నాయకులు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే హుజూరాబాద్ కరోనాకు మరో హాట్‌స్పాట్ కాకుండా ఉంటుందని చెప్పారు.
- శ్రీనివాస్, డీహెచ్
సాధారణంగానే ఎన్నికల ప్రచారాల్లో వేలాదిగా ప్రజలు, కార్యకర్తలు పాల్గొంటారు. నేతల ఇంటింటి ప్రచారాలు, భారీ బహిరంగ సభలు వెరసి భౌతిక దూరం పాటించే అవకాశాలు చాలా తక్కువ. అందుకే.. ప్రజలు, నేతలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించి.. హుజూరాబాద్ నియోజకవర్గం మరో నాగార్జునసాగర్ కాకుండా చూడాలని కోరుతున్నారు.
- ఇదీ చదవండి : Corona Virus: రష్యాలో కొత్తగా గామా వేరియంట్ కేసులు