Horse Riding: గుర్రపు స్వారీ ఇది కేవలం సినిమాల్లో టీవీల్లో మాత్రమే చూస్తాం.. ఇక పేద మధ్యతరగతి కుటుంబాలు గుర్రపు స్వారీ నేర్చుకోవాలన్న ఆలోచనకు కూడా చాలా దూరం. ఎందుకంటే గుర్రపు స్వారీ నేర్చుకోవాలంటే మెట్రో నగరాలకు వెళ్లాల్సి రావడం, ఖర్చు భరించలేక చాలా మంది వెనకడుగు వేస్తారు. ఇప్పుడు హార్స్ రైడింగ్ శిక్షణ కరీంనగర్‌లో అందుబాటులోకి వచ్చింది. వేసవి కాలంలో పిల్లలకు ఏదైనా నేర్పించాలనుకునే తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్రపు స్వారీలో శిక్షణ ఇప్పిస్తున్నారు. రొటీన్‌గా స్విమ్మింగ్ లేదా ఇతర క్రీడలకంటే కూడా గుర్రపు స్వారీ ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులను ఆకర్షిస్తోంది.
పెరుగుతోన్న ఆదరణ: గుర్రపు స్వారీ శిక్షణకు ఫీజు కూడా అందుబాటులోనే ఉండటంతో మంచి ఆదరణ కనిపిస్తోంది. ఈతలాగే గుర్రపు స్వారీలోనూ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వ్యాయామం చేసినట్టుగా ఉండటంతో పాటు గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు అవుతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. హార్స్ రైడింగ్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. తమ చిన్నారులు ఆత్మవిశ్వాసంతో గుర్రపు స్వారీని నేర్చుకోవడం పట్ల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారుల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం: గుర్రపు స్వారీ అంటే సైకిల్‌పై ఎక్కి తొక్కడం ప్రారంభించినట్లుగా ఉండదు. ముందుగా గుర్రాన్ని మచ్చిక చేసుకోవాలి. గుర్రంతో స్నేహంగా మెలగాలి. దానితో ఒక బాండింగ్ ఏర్పరచుకోవాలి. ఒకరితో ఒకరికి హాని జరగబోదన్న నమ్మకం ఏర్పడాలి. అప్పుడే గుర్రం స్వారీ చేసేందుకు సిద్ధపడుతుంది. అందుకోసం ముందుగా పిల్లలను గుర్రాలకు అలవాటు చేస్తారు. వాటిని తాకడం, స్నేహంగా మెలగడం నేర్పిస్తారు. గుర్రాలంటే ఉన్న భయాన్ని క్రమంగా పోగొడతారు. తర్వాత వాటిపై కూర్చోబెట్టి వారం రోజుల పాటు వాకింగ్ చేయిస్తారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగిన తర్వాత నెమ్మదిగా పరుగెత్తడం నేర్పిస్తారు. ఆ తర్వాత క్యాంటర్ అనే జంప్స్ చేయడం, గ్యాలప్ రింగ్స్‌లో కాకుండా బయట మైదానాల్లోకి తీసుకెళ్లి స్పీడ్ రన్ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన పిల్లలతో చెరువు గట్లు, మైదాన ప్రాంతాల్లో లాంగ్ రైడ్‌లు ప్రాక్టీస్ చేయిస్తారు. గుర్రపు స్వారీ శిక్షణ పొందుతున్న చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గుర్రాలపై స్వారీ చేయడం బాగుందని చెబుతున్నారు. గుర్రపు స్వారీ శిక్షణకు మంచి స్పందన ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. పిల్లలు ఉత్సాహంగా గుర్రపు స్వారీ చేస్తున్నారని హార్స్ రైడింగ్ కోచ్ జోసెఫ్ చెప్పారు. గుర్రపు స్వారీతో శారీరక వ్యాయామం చేసినట్లు ఉంటుందని శిక్షణ కేంద్రం యజమాని ప్రేమ్‌రెడ్డి తెలిపారు.
వేసవి వచ్చిందంటే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి వాటి శిక్షణకు పంపిస్తారు. కానీ చాలా అరుదైన గుర్రపు స్వారీ శిక్షణ అందుబాటులోకి రావడంతో చాలా మంది ఇటువైపే మొగ్గు చూపుతున్నారు. నెలకు 5 వేల రూపాయలు ఫీజుగా వసూలు చేస్తున్నట్లు శిక్షణ కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: