గోదావరి దిశ మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి కరీంనగర్ జిల్లాలోని మధ్య మానేరుకు పరుగులు పెడుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోనే తొలిసారి ఏకకాలంలో జలాశయాలకు అనుబంధంగా ఉన్న పంపుహౌసులు పని ప్రారంభించాయి.
దీంతో ప్రాణహిత, గోదావరి ఎగువకు జలాలు ఎగిసిపడుతున్నాయి. 88 మీటర్ల మట్టం నుంచి లక్ష్మీ బ్యారేజీలో (కన్నెపల్లి) నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. ఇక్కడి నుంచి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నందిమేడారం జలాశయాల మీదుగా బుధవారం సాయంత్రం నుంచి 318 మీటర్ల స్థాయిలో ఉన్న మధ్యమానేరుకు మొత్తం 30 పంపుల ద్వారా నీటిని తరలిస్తున్నారు. గురువారం నాటికి లింక్-1, 2 కలిపి 35 పంపులను నడిపించనున్నారు. దీంతో కాళేశ్వరం ఎత్తిపోతల్లో తొలిసారి అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది.
ఏకధాటిగా 230 అడుగుల ఎత్తుకు..
లక్ష్మీ పంపుహౌస్ వద్ద 88 మీటర్ల స్థాయి నుంచి నీటిని తీసుకుని సరస్వతి జలాశయానికి ఎత్తిపోస్తున్నారు. లక్ష్మీ పంపుహౌస్ ఎత్తిపోసిన నీరు 3 గంటల వ్యవధిలోనే 318 మీటర్ల వద్ద ఉన్న మధ్యమానేరుకు చేరుకుంటున్నట్లు ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. 230 అడుగుల ఎత్తును మూడు గంటల్లో అధిగమిస్తున్నట్లు పేర్కొంటున్నారు. లక్ష్మీ పంపుహౌస్ నుంచి ఎల్లంపల్లికి 110 కి.మీ. కాగా ఇక్కడి నుంచి మధ్యమానేరుకు 65 కి.మీ. దూరం ఉంది. గోదావరి జలాలు 175 కి.మీ.ల దూరం ప్రయాణించి మధ్యమానేరును తాకి పొలాలను స్పృశించనున్నాయి.
నేటి నుంచి పూర్తిస్థాయిలో..
కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్-1లో లక్ష్మీ పంపుహౌస్‌లో బుధవారం 6 మోటార్లను ప్రారంభించగా గురువారం ఉదయం వరకు 11కు పెంచనున్నారు. సరస్వతిలో పంపుల సంఖ్యను 6 నుంచి 7కు, పార్వతిలో 6 నుంచి 8కి, లింక్-2లోని నంది పంపు హౌసులో 4 నుంచి 6కు, గాయత్రిలో 4 పంపుల నుంచి 6 పంపులకు పెంచనున్నారు. ఇలా తొలిసారి రెండు టీఎంసీల సామర్థ్యమున్న నీటిని 35 పంపులతో గురువారం తరలించనున్నట్లు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు తెలిపారు.
జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరద హెచ్చరిక
కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు ఎగువ జలాశయాలు నిండి ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ పేర్కొంది. దీంతో కొన్ని రోజుల్లో ప్రవాహాలు పెరిగి జూరాల, శ్రీశైలం జలాశయాలకు భారీ వరద వచ్చే అవకాశాలున్నాయని అప్రమత్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్లు అప్రమత్తమయ్యారు.
‘కాళేశ్వరం’పై విచారణ ఎన్జీటీ ప్రధాన బెంచ్‌కు బదిలీ
ఈనాడు, దిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) దిల్లీ ప్రధాన బెంచ్ విచారిస్తుందని చెన్నై బెంచ్ తెలిపింది. నిబంధనలు అతిక్రమించి కాళేశ్వరం పనులు చేపడుతున్నందున వాటిని నిలిపివేయాలని కోరుతూ వేములఘాట్ భూ నిర్వాసితుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ ఎన్జీటీ చెన్నై బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌ను జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం జులై 22న విచారించింది. అయితే, ప్రాజెక్టు అనుమతులపై ఇప్పటికే దిల్లీలోని ఎన్జీటీ ప్రధాన బెంచ్‌లో విచారణ సాగుతోందని.. ఒకే అంశంపై రెండు చోట్ల విచారణ సరికాదని నాడు తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌ను ప్రధాన బెంచ్‌కు బదిలీ చేసినా తమకు అభ్యంతరం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో స్పష్టతనివ్వాలని జస్టిస్ రామకృష్ణన్ ప్రధాన బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. చెన్నైలో దాఖలైన పిటిషన్‌నూ విచారిస్తామని దిల్లీలోని ప్రధాన బెంచ్ స్పష్టం చేసినందున ఈ మేరకు బదిలీ చేసినట్లు బుధవారం జస్టిస్ రామకృష్ణన్ తెలిపారు. ఈ నెల 31న ఎన్జీటీ ప్రధాన బెంచ్ రెండు పిటిషన్లను కలిపి విచారించనుంది.
ఇవీ చూడండి: తెలంగాణకు 37.67, ఏపీకి 17 టీఎంసీలు