హుజూరాబాద్‌లో ఎన్నికలు రావాలని, ఈటల రాజేందర్ ను పువ్వు గుర్తుతో గెలిపించాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారని మాజీమంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అడ్డదారులు తొక్కుతూ ప్రజలను మభ్య పెట్టేందుకు కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. హుజూరాాబాద్‌లో దొంగఓట్ల నమోదు ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు.
హుజూరాబాద్‌లో దొంగఓట్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ప్రజలను మభ్య పెట్టేందుకు తెరాస కృషి చేస్తోంది. నియోజకవర్గానికి చెందని వారికి కూడా ఇక్కడ ఓట్లు నమోదు చేస్తున్నారు. తమకు ఓటేయబోరని... నాకు ఓటేస్తారని భావిస్తున్న వారి ఓట్లు తొలగిస్తున్నారు. ఒక్కో ఇంట్లో 30, 40 ఓట్లు నమోదు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే దొంగ ఓట్లు సృష్టించారు.
హుజూరాబాద్, జమ్మికుంటలో దొంగఓట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు తమ ఓటును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు చట్టాన్నిమరిచి బానిసల్లా పని చేయవద్దని హెచ్చరిస్తున్నా. దొంగ ఓట్ల అంశంపై కార్యకర్తలతో కలసి ఉద్యమం చేస్తాం. తెరాస అరాచకాలకు సహకరించే అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం.
-మాజీ మంత్రి ఈటల రాజేందర్
తెరాస లక్ష రూపాయలు ఇచ్చి ఓటు కొనాలని చూసినా... డబ్బులు తీసుకుని ప్రజలు ఈటల రాజేందర్‌కు ఓటు వేస్తామంటున్నారని ఈటల తెలిపారు. దొంగ ఓట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తమ ఓటును కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. అధికారులు చట్టాన్ని మరిచి బానిసల్లా పనిచేయొద్దని సూచించారు. దొంగ ఓట్లపై భాజపా కార్యకర్తలతో కలసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Etela Rajender: 'నిజాలు చెప్పినందుకే.. మంత్రి పదవి పోయింది'